Maharashtra Political Crisis: ఏక్‌నాథ్ షిండే పదవికి ఎసరు?
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ కలకం రేగనున్నదా?
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ కలకం రేగనున్నదా? అంటే.. ఉద్దవ్ థాక్రే వర్గం శివసేనకు చెందిన అధికార పత్రిక సామ్నాలో అవుననే చెబుతోంది. సుధీర్గ కాలం పార్టీలో కొనసాగి ఉద్దవ్ థాక్రేపై తిరుగుబాటు చేసి మహారాష్ట్ర రాజకీయాల్లో ఏక్‌నాథ్ షిండే సంచలనం సృష్టించారు. బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అయితే షిండేతో పాటు వెళ్లిన 40 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది అసంతృప్తితో ఉన్నట్టు సామ్నా తాజాగా వెల్లడించింది. షిండే సీటుకు ఎసరువచ్చేలా ఉందంటూ వ్యాఖ్యానించింది. ఏ క్షణంలోనైనా సీఎం పదవిని కోల్పోయే అవకాశం ఉందంటూ తెలిపింది. దీంతో మళ్లీ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మారే అవకాశం ఉందంటూ వెల్లడించింది. అదే జరిగితే ఆ రాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కుతాయి.
నిజానికి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలోని 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా పదవులను ఆశించి వెళ్లినవారే అందులోని 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు సామ్నా చెబుతోంది. ఏక్‌నాథ్ షిండేను బీజేపీ తాత్కాలికంగా ఆ పదవిలో కూర్చోబెట్టిందని సామ్నా వ్యాఖ్యానించడం గమనార్హం. ముఖ్యమంత్రి పదవిని షిండే ఏ క్షణమైనా కోల్పోతారని ప్రతిఒక్కరికి అర్థమైందంటూ తెలిపింది. అంధేరీ ఈస్ట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో షిండే వర్గం పోటీ చేయాలని భావించింది. అయితే అందుకు బీజేపీ నిరాకరించింది. దీంతోనే ఇరువర్గాల మధ్య విభేదాలు స్పష్టమైనట్టు సామ్నా చెప్పింది. అంతేకాదు గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించామని షిండే వర్గం చెప్పటం పూర్తిగా తప్పని సామ్నా స్పష్టం చేసింది. 22 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని వారంతా బీజేపీతో కలిసేందుకు సిద్ధమవుతున్నారని ఉద్ధవ్ థాక్రే వర్గం చెబుతోంది.
ఏక్‌నాథ్ షిండే తనకు తాను, మహారాష్ట్రకు చాలా నష్టం చేశారని సామ్నా ఆరోపించింది. రాష్ట్ర ప్రజలు వదిలిపెట్టరని, షిండేను తమ స్వప్రయోజనాల కోసం బీజేపీ వినియోగించుకోవటం కొనసాగిస్తుందని విమర్శించింది. తాజాగా బీజేపీకి చెందిన ఓ నాయకుడి వ్యాఖ్యలను ఉదాహరించింది. ప్రభుత్వం 40 మంది ఎమ్మెల్యేలతో నడుస్తోందని, వారంతా ముఖ్యమంత్రి కార్యాలయం నియంత్రణలో ఉన్నారన్నంటూ చేసిన వ్యాఖ్యలు చేసినట్టు తెలిపింది. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిర్ణయాలు తీసుకుంటారని వాటినే షిండే ప్రకటిస్తున్నారని ఆరోపించింది. షిండే వర్గం.. ఉద్దవ్ వర్గం.. ఎవరికి వారు.. తమదే అసలైన శివసేన అంటూ ప్రకటిస్తున్నాయి. ఈ వివాదం కాస్తా ఎన్నికల కమిషన్‌కు చేరుకుంది. అసలైన శివసేన, పార్టీ గుర్తు విల్లంభును స్తంభింపజేసింది. ఇరువురికి ప్రత్యేక పార్టీ పేర్లతో పాటు గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది.