Oxygen Tanker Leak: అరగంట వెంటిలేటర్ ఆఫ్..22 మంది బలి..
Oxygen Tanker Leak: ఓ పక్క కరోనా మహమ్మారి ఆ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది.
Oxygen Tanker Leak: ఓ పక్క కరోనా మహమ్మారి ఆ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. ప్రతిరోజు లక్షల్లో కేసులు వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. అది సరిపోదు అన్నట్టు కొవిడ్ ఆస్పత్రుల్లో వరుస ప్రమాదాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కరోనా సమయంలో కొవిడ్ బాధితులకు కావాల్సిందే ఆక్సిజన్. అలాంటి ఆక్సిజన్ సరఫరాను కొంతసేపటివరకు ఆపేయడంతో 22 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ హృదయ విదారకర ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.
మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాసిక్ జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలో ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా ఆక్సిజన్ లీక్ అయింది. ఆస్పత్రి యాజమాన్యం ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయడంతో ఐసీయూలో ఉన్న రోగులకు అరగంట పాటు ఆక్సిజన్ అందలేదు. దీంతో 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 31 మందిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆక్సిజన్ నిలిచిపోయే సమయానికి వెంటిలేటర్, ఆక్సిజన్ సప్లయ్‌పై మొత్తం 150 మంది రోగులు ఉన్నట్టు సమాచారం. ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఘటనపై స్పందించింది ఆస్పత్రి యాజమాన్యం. ట్యాంకర్ నుంచి ఆక్సిజన్ లీక్ అయిందని, దానిని ఆపేందుకే సరఫరాను నిలిపివేయాల్సి వచ్చిందని యాజమాన్యం తెలిపింది. ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ప్రమాదం జరిగిందని స్పష్టం చేసింది. మరో 31 మంది రోగులను స్థానిక ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నట్టు చెప్పింది.
నాసిక్ జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ లీక్ ఘటనపై బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రమాదంపై మహారాష్ట్ర సర్కార్ స్పందించింది. ఆక్సిజన్ సరఫరాలో లోపం వల్లే రోగులు మరణించినట్లు భావిస్తున్నామని ప్రకటించింది. ప్రమాద ఘటనపై విచారణకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. విచారణ పూర్తయ్యాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి రాజేశ్ తోపే.