Wayanad Landslides: వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడి 180 మంది మృతి
Wayanad Landslides: వయనాడ్ విషాదంపై విరాళం ప్రకటించిన పారిశ్రామిక వేత్తలు
Wayanad Landslides: కేరళలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 180 మంది చనిపోయినట్లు కేరళ వైద్యారోగ్య శాఖ తెలిపింది. మరో 91 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు 191 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వయనాడ్‌లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పడి, మండక్కై, చూరాల్‌మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. మరోవైపు టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీల ఆచూకీ లభించడం లేదు.
వయనాడ్ విషాదంపై అదానీ గ్రూప్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు 5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. అదానీ గ్రూప్‌తో పాటు, ఆర్పీ గ్రూప్ రవి పిళ్లై, లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ యూసఫ్ అలీ, కల్యాణ్ జువెలర్స్ ఛైర్మన్ ఎండీ టి.ఎస్.కల్యాణరామన్‌లు సైతం 5 కోట్ల రూపాయల చొప్పున విరాళాన్ని సీఎం సహాయనిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు.
భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ప్రకృతి వైపరీత్యం గురించి పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని వారం రోజుల ముందే అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఈ మేరకు కేరళలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యంపై పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. కేరళ ప్రభుత్వం ఉదాసీనత కారణంగానే ఇంత మంది ప్రాణాలు కోల్పోయారన్నారు అమిత్ షా.