సరికొత్త కథలను ఎంపిక చేసుకోవడంలో ముందుండే హీరోలలో రానా దగ్గుబాటి పేరు ముందే ఉంటుంది. అయితే రానా తాజాగా 'నీది నాది ఒకే కథ' దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. 'విరాటపర్వం 1992' అనే ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. టైటిల్ చూస్తేనే ఈ సినిమా 1990 బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది అని అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం స్టార్ కాస్ట్ ని ఎంపిక చేసుకుంటూ దర్శక నిర్మాతలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాలో టబు ఒక కీలకమైన పాత్ర చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రియమణి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. తాజాగా దర్శక నిర్మాతలు మరొక నటిని ఎంపిక చేశారు. ఆమె 'గాజుల కిష్టయ్య', 'అమర ప్రేమ', 'హేమాహేమీలు' వంటి సినిమాలలో కనిపించిన జరీనా వాహబ్. ఆమె ఆఖరి సారిగా తెలుగులో రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర' సినిమా లో కనిపించింది. మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు ప్రేక్షకులను రానా సినిమా ద్వారా పలకరించబోతోంది. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జూన్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.