Tirupati laddu: సినిమా ఇండస్ట్రీకి పాకిన లడ్డూ వివాదం.. ప్రకాశ్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు
తిరుమల లడ్డూ వివాదంలోకి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఎంట్రీ ఇచ్చారు
తిరుమల లడ్డూ నాణ్యతకు సంబంధించి దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. టీడీపీ వర్సెస్ వైసీపీ అంటూ సాగుతోన్న ఈ చర్చలోకి తాజాగా సినిమా ఇంసడ్ట్రీకి చెందిన ప్రముఖలు సైతం ఎంటర్ అయ్యారు.
తిరుమల లడ్డూ వివాదంలోకి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఎంట్రీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేయగా దానికి మంచి విష్ణు కౌంటర్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. నటుడు ప్రకాశ్ రాజ్ తిరుమల లడ్డూ ప్రసాద వివాదంపై ఓ ట్వీట్ చేశాడు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కోట్ చేస్తూ, ‘మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు (కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు #జస్ట్ ఆస్కింగ్)' అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
దీంతో ఈ ట్వీట్‌కు బదులిస్తూ మా అధ్యక్షుడు మంచు విష్ణు ఓ ట్వీట్ చేశారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేస్తూ... దయచేసి మీరు మరీ అంతలా నిరుత్సాహపడి, అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నాలాంటి కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే కోరారు. ధర్మ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే, మతం ఏ రంగు పులుముకుంటుందో?. మీ పరిధుల్లో మీరు ఉండండి అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేశారు. కాగా ఈ ట్వీట్‌కు కూడా ప్రకాశ్ బదులిచ్చారు. దీనిపై ట్వీట్ చేస్తూ.. 'ఓకే శివయ్యా.. నా అభిప్రాయం నాకు ఉంది, మీ అభిప్రాయం మీకు ఉంది. ఈ విషయాన్ని నోట్ చేసుకున్నాను' అంటూ రాసుకొచ్చారు.