సినిమా స్టోరీకి మించిన స్టోరీ. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే రియల్ స్టోరీ. రీల్ లైఫ్‌లో కనిపించే సేమ్ సీన్లు. మూవీకి ఏమాత్రం తీసిపోని ట్విస్టులు. మలుపుల మీద మలుపులు. నిందితులు ముగ్గురు అన్నారు. వారికి నెంబర్లు కూడా ఇచ్చారు. కానీ తర్వాత అవి మారిపోయాయి. ఎందుకు మారిపోయాయి.? ఎవరు మార్చారు? కావాలని జరిగిందా? కలిపించుకొని మార్చారా? ఇంతకీ శ్రావణి కేసులో ఎందుకు ఇన్ని ట్విస్టులు కనిపిస్తున్నాయ్? శ్రావణి సూసైడ్ నుంచి నిందితుల అరెస్టు వరకు అసలేం జరిగింది?
శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తూనే ఉన్నాయ్. ముగ్గురు కలసి మూడు రకాలుగా వేధించి ముప్పు తిప్పలు పెట్టడం వల్లే శ్రావణికి బతుకు మీద విరక్తి కలిగిందని పోలీసులు చెబుతూ వచ్చారు. వాస్తవానికి కూడా జరిగింది అదే. ఎందుకంటే శ్రావణి సూసైడ్ చేసుకున్న తర్వాత లీకైన ఆడియోలు అసలు సంగతిని బయటపెట్టాయి. కానీ అంతలోనే నిందితుల నెంబర్లు మారడమే మరో ట్విస్టుకు కారణమైంది? శ్రావణి కేసులో ఏంటీ ఈ నెంబరు మార్పు?
శ్రావణి ఆత్యహత్య కేసులో గంటకో ట్విస్టు తెరపైకి వస్తోంది. కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. విచారణే కాదు చివరకు నిందితుల రిమాండ్ కాపీలో కూడా ట్విస్ట్‌లే కనిపిస్తున్నాయ్. పోలీసులు ముందు హడావిడిగా ఒకరి పేరు చెప్పి వేరేగా మరొకరిని తెరపైకి తేవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముందు నుంచి కూడా శ్రావణి కేసు నిజంగా సీరియల్‌నే తలపించింది. ఎన్నో వీడియోలు, ఆడియోలు, ఫొటోలు చుట్టూ ఎన్నో మలుపులు తిరిగింది. విచారణంలో ఇప్పటికీ ట్విస్టులు కనిపిస్తూనే ఉన్నాయ్. మాటలు వేరేగా వినిపిస్తూనే ఉన్నాయ్.
ఇంతకుముందు అనుకున్నట్టుగా విచారణలోనే ట్విస్టులు ఉన్నాయనుకుంటే చివరగా అదుపులోకి తీసుకున్న అశోక్‌రెడ్డిని రిమాండ్‌కి పంపే వరకూ కూడా కేసులో అదే టెన్స్ క్రియేట్ అయింది. ముందుగా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్, సాయిని విచారించి రిమాండ్ చేసిన పోలీసులు ఏ1గా సాయికృష్ణారెడ్డిని, ఏ2గా అశోక్‌రెడ్డి, ఏ3గా దేవరాజ్ పేర్లు చేర్చారు. ముగ్గురికీ ఈ కేసులో సమానమైన పాత్ర ఉందని పోలీసులు తెలిపారు.
ఇంతవరకు బాగానే ఉంది సాయి, దేవరాజ్ రిమాండ్‌లో ఉన్నప్పుడే మరో నిందితుడు, ఆర్‌ఎక్స్ 100 నిర్మాత అశోక్‌రెడ్డి పరారయ్యాడు. రెండు రోజుల హైడ్రామా తర్వాత అశోక్‌రెడ్డి పోలీసుల ముందు లొంగిపోయాడు. దీంతో అప్పటివరకు ఏ2గా చెప్పిన అశోక్‌రెడ్డిని ఉన్నపాటున ఏ3గా మార్చారు. అదీగాక బలమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌ను ముందు ఏ3గా చెప్పి తర్వాత ఏ1గా చేర్చారు. అప్పటికీ ఏ1గా ఉన్న సాయిని, ఫైనల్‌గా కేసులో ఏ2గా చూపించారు పోలీసులు.
ఇదే విషయం పలు అనుమానాలకు తావిస్తోంది. రిమాండ్ కాపీలో పేర్లు మార్చడంపై విమర్శలకు కారణమవుతోంది. అశోక్‌రెడ్డిని అదుపులోకి తీసుకోక ముందు జరిగిన విచారణ ఆధారంగా ముందు A1, A2 పేర్లను పోలీసులు రివీల్ చేశారని, కానీ అశోక్‌రెడ్డిని కూడా విచారించిన తర్వాత రిమాండ్ కాపీలో పేర్లు మార్చారని ప్రచారం జరుగుతోంది. అశోక్‌రెడ్డి ఇచ్చిన ఎవిడెన్స్ ఆధారంగా రిమాండ్ కాపీలో పేర్లు మళ్లీ మార్చాల్సి వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయ్. అయితే నిర్మాత అశోక్‌రెడ్డి పలుకుబడి ఉపయోగించి లాబీయింగ్ చేసి తన పేరు A3గా చేర్చే విధంగా పావులు కదిపినట్లు చెప్పుకుంటున్నారు. ఏమైనా సంచలనం సృష్టించిన శ్రావణి ఆత్మహత్య, ఆ కేసులో పోలీసులపై ఒత్తిళ్లు రావడంతో మార్పులు అనివార్యంగా, అనూహ్యంగా జరిగినట్టు పోలీసువర్గాల్లో ఆఫ్ ద రికార్డ్‌గా మాట్లాడుకోవడం కొసమెరుపు.
నిర్మాత అశోక్‌రెడ్డి అరెస్టుతో సీరియల్ నటి శ్రావణి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అశోక్‌రెడ్డి తన శాడిజం చూపించడం వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకోవల్సి వచ్చిందన్న విషయం పోలీసుల విచారణలో తేలింది. 2017 నుంచి అశోక్‌రెడ్డికి పరిచయం పెంచుకున్న శ్రావణి ఆర్‌ఎక్స్ 100లో గెస్ట్ రోల్‌లో నటించడం ఆ తర్వాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అలా అన్ని విధాలుగా శ్రావణిని వాడుకున్న అశోక్‌రెడ్డి తనను కాదని ఎవరిని పెళ్లి చేసుకోవద్దని బెదిరించారని పోలీసులు చెబుతున్నారు.
శ్రావణి సూసైడ్ కేసులో సాయికృష్ణారెడ్డి, దేవ్‌రాజ్ పాత్ర ఎంత ఉందో నిర్మాత అశోక్‌రెడ్డి పాత్ర కూడా అంతే ఉంది. ఎందుకంటే ఆత్మహత్య చేసుకునే రోజు కూడా అశోక్‌రెడ్డి శ్రావణి ఇంటికి వచ్చాడు. శ్రావణి కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లోనే బెదిరింపులకు దిగాడు. అదే సమయంలో శ్రావణి ఇంటికి సాయి కూడా రావడంతో ఇద్దరూ కలిసి శ్రావణిని టార్చర్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సాయి, అశోక్‌రెడ్డి వేధింపులను ఫ్రెండ్ కదా అని దేవరాజ్‌తో షేర్ చేసుకోవడం దాన్ని దేవ్‌రాజ్ అడ్వాంటేజ్ తీసుకోవడం ఇవన్నీ శ్రావణిని గుండెను మెలిపెట్టి పిండేసి ఉంటాయని పోలీసులు అంటున్నారు. సాయికృష్ణ, అశోక్‌రెడ్డిలను దూరం పెడితేనే, పెళ్లి చేసుకుంటానని దేవ్‌రాజ్ కండీషన్ పెట్టడం అన్నట్టుగానే కొన్నాళ్ల నుంచి శ్రావణికి దూరంగా ఉండటంతో ఈ ముగ్గురు వేధింపులను తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తేల్చారు.
ఆర్ఎక్స్ 100 కంటే ముందు అశోక్‌రెడ్డి కార్తికేయను హీరోగా ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమా తీశాడు. ఈ చిత్రంలో శ్రావణి ఒక పాత్ర చేసింది. సాయికృష్ణ సిఫారసు మేరకే అశోక్‌రెడ్డి శ్రావణికి ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడట. ఆ సందర్భంగా ఆమెను లొంగదీసుకునేందుకు గట్టిగా ప్రయత్నించాడని ఆ తర్వాతి కాలంలో కూడా ఆమెను వేధించాడని పోలీసులు అంటున్నారు. కొన్నాళ్ల పాటు శ్రావణి కూడా అశోక్‌రెడ్డితో సన్నిహితంగా మెలిగిందని కొందరు చెబుతుంటే ఆ దిశగా సాయికృష్ణ ఆమెను ఒత్తిడి చేశాడని మరో వాదన వినిపిస్తోంది.
ఇంతకుముందు శ్రావణి ఆత్మహత్యకు దేవరాజ్ కారణమని సాయి.. కాదు కాదు... సాయే కారణమని దేవరాజ్ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. వారి వద్ద ఉన్న ఫోన్ ఆడియోలను బయట పెట్టారు. దీంతో ఈ కేసు చిత్ర విచిత్రాలు తిరిగి పోలీసులనే తికమక పెట్టింది. మొదట్లో సాయి, దేవరాజ్ పేర్లే వినిపించినా తర్వాత అశోక్‌రెడ్డి పేరు కూడా తెరపైకి రావడం విచారణలో అశోక్‌రెడ్డి శాడిజం బయటపడంతో శ్రావణి ఆలోచన ఆత్మహత్య వైపు మళ్లిందన్నది పోలీసుల వెర్షన్. ఏది ఏమైనా ఈ కేసు మూడు మలుపులు తిరిగింది. దేవరాజ్ తరువాత సాయి, అశోక్‌రెడ్డిలు ఇలా మూడుముక్కలాటలో శ్రావణి అన్యాయంగా బలైంది.
ఈ కేసుకు సంబంధించి అన్ని వీడియోలు, ఆడియో టేపుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా దేవరాజ్ అందించిన కొన్ని సీక్రెట్ వీడియోలు, ఆడియో టేపులు కూడా ఇందులో ఉన్నాయి. శ్రావణి ఆత్మహత్యలో ఎవరి ప్రమేయం ఎంత ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకెన్ని ఆడియో క్లిప్పులు రిలీజ్ అవుతాయా అని పోలీసులు కూడా ఎదురుచూడడం విశేషం.
ఏమైనా ఇది ఓ శ్రావణి కథ. అంతులేని వ్యథ. చిన్న వయస్సులో మంచి పేరు సంపాదించుకొని తాను నమ్మిన రంగంలో రాణిద్దామని అనుకుంటున్న తరుణంలో తన జీవితం ఊహించని మలుపు తిరిగింది. తన జీవితంలాగానే తాను చనిపోయిన తర్వాత కూడా కేసు కూడా అంతే ఊహతీతంగా మలపులు తిరుగుతోంది. చూడాలి మరి. శ్రావణి కేసు ఎటు నుంచి ఎటు వైపు మళ్లుతుందో ఎవరెవరని బాధ్యులను చేస్తుందో!!