Ari movie: అరి ఎందుకు ఆగిపోయినట్లు.? అనసూయ సినిమాకు అసలు కష్టం ఏంటి.?
Ari movie: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొన్ని సినిమాలు ఇలా షూటింగ్ మొదలై అలా థియేటర్లలోకి వచ్చేస్తే. మరికొన్ని చిత్రాలు మాత్రం ఏడాది ఏడాది షూటింగ్ జరుపుకుంటేనే ఉంటాయి.

Ari movie: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొన్ని సినిమాలు ఇలా షూటింగ్ మొదలై అలా థియేటర్లలోకి వచ్చేస్తే. మరికొన్ని చిత్రాలు మాత్రం ఏడాది ఏడాది షూటింగ్ జరుపుకుంటేనే ఉంటాయి. ఇక మరికొన్ని చిత్రాలు మాత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నా విడుదలకు నోచుకోవు. అలాంటి జాబితాలోకి వస్తుంది ‘అరి’. ‘పేపర్ బాయ్’తో హిట్ కొట్టిన జయశంకర్ రూపొందించిన ఈ సినిమా షూటింగ్ రెండు సంవత్సరాల క్రితమే పూర్తయింది.
నిజానికి గీతా ఆర్ట్స్‌లో ఓ ప్రాజెక్ట్ చేయాల్సిన జయశంకర్, కరోనా లాక్‌డౌన్ కారణంగా దాన్ని నిలిపివేసి కొత్త నిర్మాతలతో ‘అరి’ను తెరకెక్కించాడు. ఈ చిత్రం అరిషడ్వర్గాలపై ఆధారపడి ఉంది. వినోద్ వర్మ, అనసూయ, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి ప్రముఖులు ఇందులో నటించారు. గతేడాది సినిమా రిలీజ్ కావాల్సింది. టీజర్, ట్రైలర్, పాటలు విడుదలయ్యాయి. వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతర ప్రముఖులు ఈ సినిమాకు మద్దతుగా నిలిచారు. అయినా సినిమా విడుదల కాలేదు.
ఇప్పుడు మళ్లీ ప్రమోషన్‌లు ప్రారంభమయ్యాయి. ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా థీమ్ సాంగ్ విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా వస్తోంది. కానీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. దీంతో అసలు ఈ సినిమా విడుదల ఎందుకు ఆలస్యమవుతోందన్న చర్చ నడుస్తోంది. అయితే సినిమా ఇలా వాయిదా పడుతూ రావడం వల్ల ప్రేక్షకుల్లో మూవీపై ఆసక్తి కోల్పోయే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిర్మాతలు వెంటనే చర్యలు తీసుకొని సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.