The Kerala Story: వివాదం ఏంటి.. సినిమాలో ఏముంది...? నిఘా వర్గాలు ఏమని హెచ్చరిస్తున్నాయి..?
The Kerala Story: గత ఏడాది విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ మూవీ దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే.
The Kerala Story: గత ఏడాది విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ మూవీ దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమా ఉదంతాన్ని మర్చిపోకముందే బాలీవుడ్ నుంచి మరో వివాదాస్పద మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకొని ఈ సినిమా ఈ శుక్రవారమే అంటే మే 5న విడుదలకు దిగుతోంది. ఇంతకీ ఆ సినిమా పేరు చెప్పలేదు కదా అదే ది కేరళ స్టోరీ. ఈ సినిమాపై కేరళ, తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మత సామరస్యాన్ని దెబ్బ తీసే ఇటువంటి సినిమాను విడుదల చేయొద్దంటూ కేరళలోని అధికార పక్షంతో పాటు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని మత తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరించే దుష్ప్రచారానికి ఉపక్రమిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ది కేరళ స్టోరీపై తమిళనాడులో కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమా విడుదల అయితే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతాయని ఆ రాష్ట్ర పోలీస్ శాఖను నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.
వివాదం ఎందుకు:
కేరళలో 32 వేల మంది మహిళలు అదృశ్యం కావడంతో వారి ఆచూకీ ఎక్కడనే పాయింట్ తో ది కేరళ ఫైల్స్ చిత్రాన్ని దర్శకుడు సుదీప్తోసేన్ రూపొందించారు. కథ విషయానికొస్తే, ఓ నలుగురు యువతులు మతం మారి ఆ తర్వాత ఐసిస్ లో చేరతారు. అయితే మతం మారిన అమ్మాయిలు ఉగ్రవాద శిక్షణ పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టినట్లు చూపించడమే వివాదానికి తెర తీసింది. మరోవైపు తన సినిమాపై వివాదం చెలరేగడంపై సుదీప్తోసేన్ రియాక్ట్ అయ్యారు.
ది కేరళ ఫైల్స్ కోసం కేరళలో ఏడేళ్లు పని చేశామని చెప్పారు...లిటరసీలో దేశంలోనే కేరళ అగ్రస్థానంలో ఉందని గుర్తు చేస్తూ సినిమా చూడకుండానే అప్పుడే ఒక అభిప్రాయానికి ఎలా వచ్చేస్తారని ప్రశ్నించారు. సినిమా చూసి ఏదైనా అభ్యంతరం ఉంటే అప్పుడు చర్చిద్దామన్నారు. మొత్తానికి, వివాదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ది కేరళ ఫైల్స్ ఈ శుక్రవారం ప్రేక్షకులముందుకు వస్తోంది. మరి, ఏ స్థాయిలో ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.