Allu Arjun: పోలీసుల విచారణలో అల్లు అర్జున్ కంటతడి..విషయం నాకెవరూ చెప్పలేదంటూ భావోద్వేగం
Allu Arjun: హైదరాబాద్ సంధ్య థియేటర్ పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా..ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో ఇప్పటి వరకు 18 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు.అందులో ఏ11 గా హీరో అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యారు. దాదాపు మూడున్నర గంటలపాటు అల్లు అర్జున్ ను పోలీసులు విచారించారు.
పలు అంశాలపై ఆయనను ప్రశ్నించి పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు. అవసరం అయితే సీన్ రీ కంస్ట్రక్షన్ లో భాగంగా సంధ్య థియేటర్ కు రావాల్సి ఉంటుందని పోలీసులు అల్లు అర్జున్కు తెలిపినట్లు సమాచారం. అయితే ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి వివారణ ముగిసిన మళ్లీ ఇంటికి చేరుకునేంత వరకు అల్లు అర్జున్ కు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
తన తండ్రి అల్లు అర్వింద్ తో కలిసి చిక్కడపల్లి పీఎస్ లో అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. అడ్వకేట్ మినహా మరెవరినీ పోలీసులు లోపలికి అనుమతించలేదు. తొక్కిసలాట ముందు..అనంతరం జరిగిన పరిణామాలపై పోలీసులు 20కు పైగా ప్రశ్నలను అడిగారు. సుమారు మూడున్నర గంటలపాటు పలు అంశాలను ప్రస్తావించారు.
అనంతరం అల్లు అర్జున్ వాంగ్మూలం తీసుకున్నారు. అవసరం అయితే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పారు. అయితే పోలీసులకు పూర్తిగా సహకరిస్తానంటూ అల్లు అర్జున్ తెలిపారు. రేవతి మరణించిన విషయం నిజంగానే తనకు ఎవరూ చెప్పలేదని అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రీమియర్ షోకు హాజరయ్యేందుకు వచ్చిన తమకు పోలీసులు పర్మిషన్ ఇవ్వని విషయం కూడా తనకు తెలియదని పోలీసులకు అల్లుఅర్జున్ తెలిపారు.