తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి వచ్చింది. తాజా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ప్రకటన వివమించుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే హీరో విజయ్ ముఖ్యమంత్రి పళనిస్వామితో భేటీ కావడం చర్చనీయంశం అయ్యింది. ఆదివారం రాత్రి గ్రీన్‌వేస్ రోడ్డులోని సీఎం నివాసంలో అత్యంత రహస్యంగా ఆయన్ను కలిశారు విజయ్. విజయ్‌తో పాటు నిర్మాతలు, దర్శకుడు సీఎంతో భేటీకి నిర్ణయించారు. అయితే ఈ భేటీని రహస్యంగా ఉంచారు. ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో గ్రీన్ వేస్ రోడ్డులోని సీఎం ఇంటికి విజయ్ వెళ్లారు. తమ తరఫున ఓ లేఖను సీఎంకు అందజేశారు.
రాజకీయాల్లోకి విజయ్‌ను రప్పించడానికి ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ ఎంతో ప్రయత్నం చేశారు. అయితే విజయ్ రాజకీయాల పట్ల వ్యతిరేకత తెలపడంతో ఎన్నికల కమిషన్ వద్ద పార్టీ పేరును వెనక్కి తీసుకున్నారు. కాగా.. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన మాస్టర్ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్నా.. విడుదలకు సమస్యలు తప్పడం లేదు. ఈ చిత్రం ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. రూ. 143 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న చిత్రం విడుదల కాబోతుంది. అయితే ప్రస్తుతం థియేటర్లలో 50 శాతం మేరకు మాత్రమే సీట్ల భర్తీకి అనుమతి ఉంది.
ఈ సమయంలో సినిమా విడుదల చేస్తే నష్టం తప్పదన్న ఆందోళన చిత్ర బృందం ఉంది. ఎలాగైనా దీని నుంచి గట్టెక్కే ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే సీఎం పళనిస్వామిని కలిసి తమ అభ్యర్థనను ఉంచేందుకు సిద్ధమయ్యారు. అందులో థియేటర్లను పూర్తి స్థాయిలో తెరవడం, వంద శాతం సీట్లను భర్తీ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. అన్ని పరిశీలించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని విజయ్‌కు సీఎం హామీ ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో విజయ్ సినిమా థియేటర్లలో రిలీజ్ కు గ్రీన్ సిగ్నాల్ వచ్చినట్లయింది.