మట్కా మూవీ రివ్యూ
గత కొంతకాలంగా వరుణ్ తేజ్ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకపక్క విభిన్నమైన సినిమాలు చేస్తూనే ఇప్పుడు సరైన హిట్ కోసం ఒక కమర్షియల్ సబ్జెక్ట్ చేశాడు. గతంలో భిన్నమైన సినిమాలు చేసిన కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ మట్కా అనే సినిమా చేశాడు మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాని రామ్ తాళ్లూరి భార్య రజినీ తాళ్లూరి ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వైరా ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు ప్రమోషనల్ కంటెంట్తో ప్రేక్షకులలో ఈ సినిమా మీద బజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ:
బర్మా దేశం నుంచి బతకడానికి భారతదేశం వచ్చిన వాసు (వరుణ్ తేజ్) నేరుగా విశాఖపట్నం చేరుతాడు. శరణార్థిగా వచ్చిన అతనికి ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. ఒకానొక సందర్భంలో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా జైల్లోనే టీనేజర్‌గా మారి బయటకు వచ్చిన వాసు పూర్ణ మార్కెట్లో అప్పల్ రెడ్డి దగ్గర పనికి చేరతాడు. అనుకోకుండా అప్పల్ రెడ్డితోనే పార్ట్నర్షిప్ అందుకొని పూర్ణ మార్కెట్ మొత్తం మీద హాట్ టాపిక్ అవుతాడు. అలా షాపులో కూలీగా జీవితం మొదలుపెట్టిన వాసు వైజాగ్ మొత్తాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? వైజాగ్ తర్వాత దేశం మొత్తం అతని నెట్వర్క్ ఎలా విస్తరించింది? మట్కా అనే ఆటను ఎలా కనిపెట్టాడు? ఆ ఆటతో ఎందరి జీవితాలను చిన్నాభిన్నం చేశాడు? ఈ ప్రయాణంలో సుజాత (మీనాక్షి చౌదరి), నాని బాబు, కిషోర్, కెబీ జాన్ విజయల పాత్రలు ఏమిటి? సిబిఐ ఎందుకు వాసుని టార్గెట్ చేసింది? సిబిఐ చివరికి వాసుని పట్టుకోగలిగిందా లేదా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
నటీనటుల విషయానికి వస్తే వరుణ్ తేజ్ ఎప్పటిలాగే తనకి బాగా అలవాటైన పాత్రలో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా వయసుతోపాటు మారుతూ వచ్చిన లుక్స్‌తో పాటు ఆయా సందర్భాలలో ఆయన నటన అయితే బాగా కుదిరింది. మీనాక్షి చౌదరి పాత్ర చాలా పరిమితం ఒక టిపికల్ కమర్షియల్ సినిమా హీరోయిన్ లాగానే అనిపించింది. కిషోర్ కుమార్ పాత్ర బావుంది. ఇక జాన్ విజయ్, సత్యం రాజేష్, నవీన్ చంద్ర వంటి వాళ్లు తమ పాత్రలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
టెక్నికల్ టీ విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ అందించిన పాటల్లో కొన్ని భావన సరే వాటి ప్లేస్మెంట్ బాలేదు. అయితే నేపథ్య సంగీతం విషయంలో మాత్రం మనోడు ఎప్పటిలాగే అదరగొట్టేశాడు. కొన్ని సీన్స్‌లో జీవి ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం అయితే బాగా కుదిరింది. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి తగ్గట్టుగానే ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం ఎందుకంటే నిజంగా 80 లలోకి వెళ్లి షూటింగ్ చేశారేమో అనేలా అక్కడి సెట్స్ రెడీ చేయడం మామూలు విషయం కాదు. ఇక నిర్మాతల నిర్మాణ విలువలకి ఏమాత్రం వంక పెట్టకుండా అత్యద్భుతంగా ఖర్చుపెట్టారు. ఎడిటింగ్ టేబుల్ మీద మరికొంత వర్క్ చేసి ఉండాల్సింది.
విశ్లేషణ
మట్కా అనే పేరు మాత్రమే మనకి కొత్త కానీ సినిమా కథ కానీ, హీరో క్యారెక్టర్ కానీ ఏ మాత్రం కొత్త కాదు. అసలు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కొత్త ప్రదేశానికి వెళ్ళిన ఒక వ్యక్తి అక్కడ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని ఏలే పరిస్థితికి ఎలా వచ్చాడు? అనే లైన్‌తో తెలుగులోనే కాదు చాలా భాషలలో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాని కూడా దాదాపుగా అదే లైన్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు దర్శకనిర్మాతలు. సినిమా మొత్తం మీద మట్కా అనే పేరుతో పాటు ఆట మాత్రమే మనకి కాస్త ఆసక్తికరమైన అంశం. అసలు ఈ మట్కా ఆట ఆలోచన ఎలా వచ్చింది? మట్కా ఆట ఎలా ఆడేవారు? ఓపెనింగ్ నెంబర్ ఏమిటి? క్లోజింగ్ నెంబర్ ఏమిటి? లాంటి విషయాలను డిస్కస్ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది.
పీరియాడిక్ కథ కావడంతో సినిమాటిక్ లిబర్టీ కాస్త ఎక్కువగానే తీసుకున్నారు. లేకపోతే దావూద్ ఇబ్రహీం క్రికెట్ బెట్టింగ్ లాంటి అంశాలతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేయరు కదా. అయితే సినిమా ప్రతిదశలోనూ ఊహకు అందే విధంగానే ఉండడం సినిమాకి మైనస్ అయ్యే అంశం. ఎక్కడా కొత్తదనం కనిపించకుండా సినిమా టీం జాగ్రత్త పడిందేమో అనేలాగా చాలా సన్నివేశాలు ఉంటాయి. తర్వాత ఏం జరగబోతోంది అనేది సగటు ప్రేక్షకుడి ఊహకు అర్థమయ్యేలా ఉండడం కాస్త ఇబ్బందికరమైన అంశమే.
హెచ్ఎంటీవీ వర్డిక్ట్: మట్కా పాత సీసాలో కొత్తసారా..