Telugu Movies on OTT: ఫుల్ టైమ్ పాస్.. ఓటీటీలో విడుదల కానున్న సినిమాలివే
New Telugu Movies on OTT: థియేటర్ లేకపోతే మళ్లీ ఓటీటీ ఎంచుకుంటున్నారు.
New Telugu Movies on OTT: కరోనా కారణంగా గత ఏడాది సినిమా రంగం తీవ్ర నష్టాలు చవిచూసింది. అయితే నష్టాల నుంచి గట్టెక్కడానికి నిర్మాతలు కొత్త దారి ఎంచుకున్నారు. దీంతో చాలా సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యాయి. ఇక ఈ ఏడాది అంతా బాగుంటుంది అనుకుంటే కరోనా మహమ్మరి మళ్లీ విజృంభిస్తుంది. ఈ క్రమంలో దర్శకనిర్మాతలు కొత్త రూట్‌లో పయనిస్తున్నారు. థియేటర్ లేకపోతే మళ్లీ ఓటీటీ ఎంచుకుంటున్నారు. కూర్చున్న చోటే కాలక్షేపం అందిస్తామంటే ఎవరు మాత్రం వద్దంటారు.
ఇక తాజాగా కొన్ని పెద్ద, చిన్న సినిమాలు కూడా వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ డేట్స్‌ను ప్రకటించాయి. మోహన్ గోవింద్ డైరెక్షన్‌లో అశ్విన్ కాకుమను ముఖ్య పాత్రలో నటించిన 'పిజ్జా 3 ద మమ్మీ' .. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' మే 13న అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో ఒకేసారి రిలీజ్ అవుతోంది. ఇంకా రిలీజ్ కానున్న సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
వకీల్ సాబ్..
ఇటీవలే థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన సినిమా 'వకీల్ సాబ్'. 'అజ్ఙాతవాసి' డిజాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ చేసిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, అంజలి, నివేదా థామస్, అనన్య, శృతి హాసన్ ముఖ్య పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించగా, థమన్ సంగీతం అందించాడు.
రంగ్‌దే..
నితిన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రంగ్‌దే'. మార్చి 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాను ఓటీటీ సంస్థ జీ 5 కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ మంచి డీల్ కుదిరితే మే 21 నుంచి జీ 5లో ప్రసారం చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
థ్యాంక్ యు బ్రదర్...
యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'థ్యాంక్ యు బ్రదర్'. సందేశాత్మక అంశంతో తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల థియేటర్లు మూత పడటంతో ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా నుంచి మంచి ఆఫర్ వచ్చింది. దీంతో అనసూయ సినిమా ఆహాలో మే 7 నుంచి స్ట్రీమింగ్ అవనుంది.
సుల్తాన్...
తమిళ నటుడు కార్తీ, రష్మిక మందాన్న హీరోహీరోయిన్లగా రూపొందిన చిత్రం 'సుల్తాన్'. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 2వ తేదీనా విడుదలైంది. బక్కియరాజ్ కణ్ణన్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా జోనర్ లో రూపోందింది. పల్లెటూరి అమ్మాయిగా రష్మిక మందాన్న ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ వేదికగా ఈ నెల 30న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
కర్ణన్..
ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కర్ణన్'. మాలి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజైంది. కోట్లాది రూపాయల కలెక్షన్లు కురిపించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఫిల్మీ దునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో మే 9 నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్‌లో మార్పు ఉండే అవకాశం ఉంది.
జగమే తంత్రం..
హీరో ధనుష్- కార్తీక్ సుబ్బరాజు కలయికలో వచ్చిన చిత్రం 'జగమే తందిరమ్'. తెలుగులో 'జగమే తంత్రం' పేరుతో విడుదల అవుతోంది. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటించింది. కరోనా కారణంగా చాలా నెలల నుంచి వాయిదా పడుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. జూన్ 18 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇందులో ధనుష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తాడట.