మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ లో ముసలం మొదలయ్యింది. మా అసోసియేషన్ ఎన్నికలు జరిగి నెల రోజులు కూడా పూర్తి కాకముందే వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన దర్శకుడు ఎఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా చేశారు. గతంలో జరిగిన అవకతవకలతో పాటు కొత్తగా ఏర్పడిన అసోసియేషన్ లోనూ నిధులు పక్క దారి పట్టాయన్న గుసగుసలు మొదలయ్యాయి.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యర్గం ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజులకే మళ్లీ లుకలుకలు బయటపడ్డాయి. మా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటాపోటీగా ఓట్లు తెచ్చుకుని చివరకు విజయం సాధించారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆ సమయంలో జరిగిన కొన్న సంఘటనలు కృష్ణారెడ్డిని మనస్థాపానికి గురి చేశాయని ఇప్పుడు ఆ వ్యవహారాలు మళ్లీ రోడ్డున పడే విధంగా చేశాయన్న టాక్ వినిపిస్తోంది.
మా అసోసియేషన్ డబ్బుతో ప్రభుత్వ పథకాలపై ప్రకటనలు చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మా సభ్యుల సంక్షేమం కోసం చేస్తున్న పనులు అందరికి తెలియ చేయడం కోసమే ఖర్చు చేశాం తప్ప మరో ఉద్దేశం కాదంటున్నారు నరేష్ వర్గీయులు. అపోజిషన్ సభ్యులు మాత్రం నరేష్ వర్గం అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మాలో జరుగుతున్న పరిణామాలపై సభ్యులు ఎవరూ నోరు విప్పటం లేదు.