సిరివెన్నెలకు దురదృష్టం.. తెలుగు వారికి అదృష్టం.. త్రివిక్రమ్ స్పీచ్ వీడియో ట్రెండింగ్
Trivikram Speech on Sirivennela: నిండు పున్నమి రాతిపై వెన్నెల అక్షరాలు చెక్కాడు,
Trivikram Speech on Sirivennela: నిండు పున్నమి రాతిపై వెన్నెల అక్షరాలు చెక్కాడు, పొద్దున్నే చందమామను ప్రేమికులకు పరిచయం చేశారు. బోటనీ పాఠమా, మ్యాటనీ ఆటనా? కుర్రకారుతో గంతులేయించిందీ సిరివెన్నెల సీతారాముడే. సిగ్గు లేని సమాజాన్ని నిగ్గతీసి ప్రశ్నించే ధైర్యాన్ని నూరిపోశారు. ఆయన అక్షరం తెలుగు పాటకు వెలుగు బాట చూపించింది. వెండితెరమీద బంగారు పాటల పందిరి పరిచింది. సిరివెన్నల అంటే సాహితీ సంపన్నుడు. ఆయన ఆలోచన ఓ పద నిధి. ప్రాణనాడులను తట్టిలేపిన ప్రణవనాదం ఆయన కలం.
సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ మాట్లాడిన మాటలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. 2012లో జరిగిన మా మ్యూజిక్ అవార్డ్స్ ఫంక్షన్‌లో త్రివిక్రమ్ మాట్లాడుతూ..సిరివెన్నెల తెలుగు సినీ కవి కావడం ఆయన దురదృష్టం..అది తెలుగు వారి అదృష్టమంటూ త్రివిక్రమ్ ప్రసంగంలో సిరివెన్నెల గురించి గూస్ బంప్స్ తెప్పించేలా చెప్పుకొచ్చాడు.
సీతారామశాస్త్రిగారి కవిత్వం గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు. నాకున్న పదాలు సరిపోవు. ఎందుకంటే 'సిరివెన్నెల'సినిమాలో రాసిన 'ప్రాగ్దిశ వేణియపైన, దినకరమయూఖ తంత్రులపైన' ఆ పాట విన్న వెంటనే తెలుగు డిక్షనరీ అనేది ఒకటి ఉంటుందని నాకు తెలిసింది. దాన్ని 'శబ్ద రత్నాకరం' అంటారని తెలుసుకున్నా. అది కొనుక్కొని తెచ్చుకుని, ప్రాగ్దిశ అంటే ఏంటి? మయూఖం అంటే ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకున్నా. ఒక పాటను అర్థమయ్యేలానే రాయాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవాలి అని కోరిక పుట్టేలా కూడా రాయొచ్చు అని తెలుగు పాట స్థాయిని పెంచిన వ్యక్తి సీతారామశాస్త్రి.
ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు.. పదాలు అనే కిరణాలు తీసుకుని, అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచంమీద వేటాడటానికి బయలుదేరతాడు. రండి నాకు సమాధానం చెప్పండి అంటాడు. మన ఇంట్లోకి వచ్చి మనల్ని పశ్నిస్తాడు. ఓటమిని ఎప్పుకోవద్దు అంటాడు. సింధూరం సినిమాలో 'అర్థ శతాబ్దం అజ్ఞానాన్నే స్వతంతం అందామా' అనే ఒక‍్క మాటతో నేను లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నా.. ఎక్కడి వెళ్తున్నానో తెలియదు. ఒక మనిషిని ఇంతలా కదిలించే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంటుంది. సిరివెన్నెల తెలుగు సినీ కవి కావటం ఆయన దురదృష్టం.. తెలుగు వారి అదృష్టం'అంటూ త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.