Tollywood: ఈ నెల‌లో ఓటీటీలో రిలీజ్ కానున్న చిత్రాలివే

Tollywood: థియేట‌ర్లు మూత‌ప‌డే స‌రికి కొన్ని సినిమాల‌కు ఓటీటీనే ప్ర‌త్యామ్న‌యంగా క‌నిపించింది.

Update: 2021-05-10 05:39 GMT

 ఓటీటీ

క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం అన్ని రంగాల‌పై ప‌డింది. ఇక సినీ ఇండ‌స్ట్రీపై క‌రోనా ప్ర‌భావం తీవ్రంగానే ఉంద‌ని చెప్పాలి. 2020లో క‌రోనా కార‌ణంగా అనేక సినిమాలు విడుద‌ల‌కు నోచుకోలేదు. దీంతో సినిమాలు అన్ని ఓటీటీ వేదిక‌గా రిలీజ్ కావ‌డం మొద‌లు పెట్టాయి. ఈ ఏడాది మొద‌ట్లో క‌రోనా ప్ర‌భావం త‌గ్గి ప‌రిస్థితులు కుదుట‌ప‌డ‌డంతో సినిమాలు రిలీజులు ఊపందుకున్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ పుణ్య‌మా అని మ‌ళ్లీ గ‌డ్డుప‌రిస్థితులు వ‌చ్చాయి. థియేట‌ర్లు మూత‌ప‌డే స‌రికి కొన్ని సినిమాల‌కు ఓటీటీనే ప్ర‌త్యామ్న‌యంగా క‌నిపించింది.

గ‌త ఏడాది అమృతరామమ్ అనే సినిమా ఓటీటీలో విడుద‌లై చిన్న సినిమాల‌కు దారి చూపించింది. దీంతో నాని వి, కీర్తిసూరేశ్ పెంగ్విన్, అనుష్క నిశ‌బ్ధం ఇలా చాలా వ‌ర‌కు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సరికొత్త సినిమాల విడుదలతో ఒటీటీలు వీక్ష‌కుల‌కు అర‌చేతిలోనే అన్ని చూపిస్తున్నాయి. ఈ నెలలో ఏయే సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయో తెలుసుకుందాం.

'బట్టల రామస్వామి బయోపిక్' సినిమాతో డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లకు శ్రీకారం చుడుతోంది. ఈ సినిమా జీ 5లో మే 14 నుంచి అందుబాటులోకి రానుంది. అల్తాఫ్ హసన్, శాంతి రావ్, సాత్విక, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వ‌హించాడు. ఈ చిత్రానికి నిర్మాతలుగా 'సెవెన్ హిల్స్' సతీష్ కుమార్ ఐ, మ్యాంగో మీడియా రామకృష్ణ వీరపనేని వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు.


మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ నవంబర్‌ స్టోరీ. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుద‌ల అవుతున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది మే 20న డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీలో స్ట్రీమింగ్ కానుంది. జీఎం కుమార్‌, పసుపతి, వివేక్ ప్రసన్న, అరుళ్‌ దాస్‌, నందిని తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇంద్ర సుబ్రమణియన్‌ దర్శకత్వం వహించాడు.


సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠ హీరోహీరోయిన్ల‌గా హాకీ క్రీడ నేప‌థ్యంలో వ‌చ్చిన చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్‌. మురళీ శర్మ, రావు రమేశ్‌ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 5న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చేసింది. సన్‌ నెక్స్ట్‌లో మే 1 నుంచి ప్రసారమవుతోంది.



 మే 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా బండి ప్రసారం కానుంది. ఈ సినిమాతో ప్రవీణ్‌ కండ్రిగుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సినిమా బండి విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.



సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం డి-కంపెనీ. దావూద్‌ ఇబ్రహీం జీవితకథ ఆధారంగా ఈసినిమా రూపొందింది. అష్వత్‌ కాంత్‌, ఇ‍ర్రా మోహన్‌, నైనా గంగూలీ, రుద్రకాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మే 15న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ స్పార్క్‌లో రిలీజ్ కానుంది.

సంతోష్‌ శోభన్‌, కావ్య థాపర్‌, శ్రద్ధా దాస్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఏక్‌ మినీ కథ. మేర్లపాక గాంధీ రచయితగా పని చేశాడు. కార్తీక్‌ రాపోలు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అమెజాన్‌ ప్రైమ్‌ ఈ సినిమాను చేజిక్కించుకోవాలని చూస్తోందట. అంతేగాక అరణ్య మే 14 లేదా ఈ నెలాఖరులో జీ 5లో ప్రసారం కానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

Tags:    

Similar News