Mohan Babu: మోహన్ బాబు @ 50 ఇయర్స్..
Mohan Babu: మోహన్ బాబు నటుడిగా 50వ వసంతంలోకి అడుగుపెట్టాడు. శోభన్ బాబు హీరోగా నటించిన కన్నవారి కలలు సినిమాతో తెరంగేట్రం చేసి 5 దశాబ్దాలు పూర్తయ్యాయి.
Mohan Babu: మోహన్ బాబు నటుడిగా 50వ వసంతంలోకి అడుగుపెట్టాడు. శోభన్ బాబు హీరోగా నటించిన కన్నవారి కలలు సినిమాతో తెరంగేట్రం చేసి 5 దశాబ్దాలు పూర్తయ్యాయి. మోహన్ బాబు ఒకప్పుడు విలన్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత దాసరి నారాయణ రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు దాసరి దర్శకత్వంలోనే వచ్చిన స్వర్గం-నరకం అనే సినిమాతో హీరోగా మారారు. మోహన్ బాబు 1975 నుంచి 1990 వరకు సినిమాల్లో విలన్‌గా నటించారు.
1990వ దశాబ్దంలో మోహన్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఆయన స్థాయిని పెంచాయి. తెలుగు చిత్రాల్లో ఆయన నటించిన అనేక చిత్రాలు ఆ తర్వాత హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అయ్యాయి. అక్కడ కూడా భారీ విజయాలు సాధించాయి. దాంతో ఆయన పేరు జాతీయ స్థాయిలో వినిపించింది. 1982లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ని స్థాపించి ప్రతిజ్ఞ చిత్రంతో నిర్మాతగా మారారు.
పెదరాయుడు విజయోత్సవాల్లో భాగంగా 200 రోజుల వేడుక తిరుపతిలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి సహా అనేక మంది రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి లక్షల మంది హాజరయ్యారని చెబుతుంటారు. ఇది భారతీయ సినిమా చరిత్రలో అత్యంత అరుదైన ఘట్టం అనేది కొంతమంది భావన.
1993లో మోహన్ బాబు నిర్మించిన మేజర్ చంద్రకాంత్ మూవీ ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో కీలక పాత్ర పోషించిందనేది కొంతమంది అభిప్రాయం. అలాగే 1992లో శ్రీ విద్యానికేతన్ విద్యా ట్రస్ట్ స్థాపించారు. అలా సినీరంగంలో రాణిస్తూనే మరోవైపు విద్యారంగంలోనూ కొనసాగుతూ వస్తున్నారు.
మోహన్ బాబు తన సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో గౌరవ పురస్కారాలను అందుకున్నారు. 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2016లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఆయన్ను వరించింది. మోహన్ బాబు 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని మోహన్ బాబు తనయుడు విష్ణు మంచు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయబోతున్నారు. 2024 డిసెంబర్ నుంచి ప్రతి నెల ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించనున్నారు. 2025 నవంబర్ వరకు ప్రతి నెల ఒకటో తేదీన ఈ ఈవెంట్స్‌కు సంబంధించిన ప్రకటన వస్తుందని తెలిపారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప లో మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా కనిపించనున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా 75 సినిమాలను నిర్మించారు. ఒక నటుడు నిర్మాతగా మారి 75 చిత్రాలు నిర్మించడం అనేది ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో రికార్డుగా సినీవర్గాలు చెబుతుంటాయి. దటీజ్ మోహన్ బాబు.