టాలీవుడ్ మెరుస్తోంది.. రేపు ఒకే రోజు పది సినిమాలు!
ఒకే రోజు పది తెలుగు సినిమాలు వెండి తెర మీద సందడి చేయనున్నాయి.
దాదాపుగా ఒక సంవత్సరం.. ప్రపంచాన్ని తిప్పలు పెట్టింది కరోనా. అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమ కరోనా దెబ్బకు అతలాకుతలం అయింది. పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. సినిమా హాళ్ళు మూత పడ్డాయి. సినీ కార్మికులు పనిలేక పస్తులున్నారు. ఈ కష్టాలకు మెల్ల మెల్లగా ముగింపు దొరుకుతోంది.
కరోనా కల్లోలం సర్డుకోవడంతో.. ప్రభుత్వం సినిమా హాళ్ళు తెరవడానికి మొదట పాక్షిక అనుమతి ఇచ్చింది. ఆ ఆసమయంలో కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో సినిమా థియేటర్లు తెర్చుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
థియేటర్లు పాక్షికంగా తెరచినపుడు సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సందడి చేశాడు. ఇక రవితేజ క్రాక్ అంటూ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాడు. ఇవే కాకుండా ఇంకా కొన్ని సినిమాలు వెండి తెరమీద సందడి చేశాయి. దీంతో గతేడాది విడుదల కాకుండా ఉండిపోయిన సినిమాలు.. అప్పట్లో షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమాలు.. వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. పెద్ద హీరోలు.. చిన్న హీరోలు.. కొత్త హీరోలు ఇలా హీరోలంతా తమ సినిమాలతో థియేటర్లకు క్యూ కట్టారు. ఇక వీటి మధ్యలో డబ్బింగ్ సినిమాల సంగతి సరేసరి.
ఈ నేపధ్యంలో రేపు అంటే ఫిబ్రవరి 5 వతేదీ తెలుగు సినిమా తెరపై మెరుపులు మేరిపించడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సినిమాలు విడుదల కాబోతున్నాయి. జనవరి నెలలో పెద్ద హీరోల సినిమలు.. పెద్ద సినిమాలు ఉండడంతో వాయిదా పడిన పలు చిన్న సినిమాలు ఈ నెలలో విడుదలకు రెడీ అయిపోయాయి. ఆ వరుసలో మొదటగా పది సినిమాలు రేపు విడుదల అవుతున్నాయి.
వీటిలో ఒకటి రెండు తప్ప అన్నీ.. కొత్త హీరోల సినిమాలే. చిన్న సినిమాలే కావడం విశేషం! రేపు విడుదల కానున్న ఆ పది సినిమాలు ఏమిటో ఒకసారి చూద్దాం..
1. ఆదిత్య ఓం హీరోగా సుమన్, కవితలు నటించిన 'చేతిలో చెయ్యేసి చెప్పు బావా' దర్శకుడు కట్ల రామ ప్రసాద్
2. తొలిసారిగా బంజారా భాషలో తెరకెక్కిన జై మరియమ్మ
3. ఈరోజుల్లో సినిమా ఫేం హీరో శ్రీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ప్రణవం. ఈ సినిమాతో కుమార్ జి. దర్శకుడుగా పరిచయం అవుతున్నారు.
4. అనురాగ్ రాజ్ పుట్, మాస్కాన్ నిధి, సంపూర్నేష్ బాబు ప్రధాన పాత్రధారులుగా టీడీ ప్రసాద్ దర్శకత్వంలో సిద్ధం అయిన రాధాకృష్ణ సినిమా.
5. మలయాళంలో హిట్ అయిన విఠల్ వాడి తెలుగు అనువాద చిత్రం
6. అదేవిధంగా మరో మళయాళ సినిమా జర్నలిస్ట్ తెలుగు రూపం
7. లింగరాజు పి. బళ్ళారి దర్శకత్వంలో నాతో ఆట
8. షకలక శంకర్, ప్రియ ప్రధాన పాత్రధారులుగా నటించిన సినిమా బొమ్మ అదిరింది.. దిమ్మ తిరిగింది
9. ఆర్యన్ గౌడ్ విద్య పాండే కాంబినేషన్ లో వస్తున్న జి- జాంబీ మూవీ
10. ఇక ఇంద్ర బాలనటుడు తేజ సజ్జ హీరోగా దక్ష నాగర్కర్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు తొలి జాంబీ చిత్రం జాంబీరెడ్డి!
చాలా కాలం తరువాత ఒకే రోజు పెద్ద ఎత్తున తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ఈ ఫిబ్రవరి 5 వ తేదీన. వీటిలో జాంబీ రెడ్డి సినిమా పై పెద్ద అంచానాలు ఉన్నాయి. బాలనటుడిగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న తేజ సజ్జాను హీరోగా పరిచయం చేస్తూ విలక్షణ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. తొలిసారిగా జాంబీ జోనర్ లో తెలుగులో వస్తున్న మూవీ జాంబీ రెడ్డి. సినిమా టీజర్.. ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో సినిమా పై అంచనాలు పెంచేశాయి.
ఇక మిగిలిన తొమ్మది సినిమాలు చిన్న సినిమాలు అయినా.. ఆసక్తిని కలిగించేలా ప్రచారాన్ని చేసుకున్నాయి. మరి ఒకే రోజు విడుదలవుతున్న ఈ పది సినిమాల్లో ఎ సినిమా జయకేతనం ఎగురవేస్తుందో చూడాలి!