సంక్రాంతి వస్తుందంటే చాలు ప్రతి హీరో తమ సినిమాలను రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవటానికి ట్రై చేస్తుంటారు. కానీ, ఈ సారి మాత్రం స్టార్ హీరోలు కరోనా వల్ల వెనకడుగు వేసారు. అయితే ఆ నలుగురు హీరోలు మాత్రం సై అంటున్నారు. ఎవరా నలుగురు హీరోలు..? ఆ హీరోలకు ఈ సంక్రాంతి కలిసొస్తుందా..?
ఈ సారి సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు నిలిచాయి. రామ్ పోతినేని నటించిన రెడ్, రవితేజ క్రాక్, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్, విజయ్ నటించిన మాస్టర్ సంక్రాంతికి విడుదల కానున్నాయి. అయితే ఈ సినిమాలు ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా వాటిని రిలీజ్ చేసి ప్రేక్షకులను అలరించాలని నిర్మాతలు చూస్తున్నారు.
మరోవైపు కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు థియేటర్ల వైపు మొగ్గు చూపడం లేదు. తాజాగా సాయితేజ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ మూవీని థియేటర్లలో రిలీజ్ చేసినప్పటికీ ప్రేక్షకులు ఏ మాత్రం ఆదరించలేదు. ఫ్యాన్స్ ఇచ్చిన షాక్‌తో ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ నాలుగు సినిమాల పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారింది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ లాంటి వాడే వకీల్ సాబ్‌ను వేసవిలో రిలీజ్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి పామ్‌లో లేని వీళ్ల సినిమాలు ఏ మాత్రం ఆడతాయోనన్న సందేహం అందరిలో నెలకొంది.
ఒకప్పుడు సంక్రాంతి టైంలో సినిమాలు రిలీజైతే కుటుంబం మొత్తం కలిసి వెళ్లి చూసే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు కరోనాతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మరి ఇలాంటి సమయంలో ధైర్యం చేసి ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆ నలుగురు హీరోల సినిమాలను ప్రేక్షక దేవుళ్లు ఏ మాత్రం ఆదరిస్తారో వేచిచూడాల్సిందే.