దర్శకరత్న డా.దాసరి నారాయణరావు అంటే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని అందరూ అనుకునేవారు. కానీ ఆయన మరణాంతరం టాలీవుడ్ దిక్కులేనిది అయింది. ఇప్పటికీ ఆయన లేని లోటు అలానే ఉంది. కాళ్లకు కనీసం చెప్పుల్లేకుండా మద్రాసులో అడుగుపెట్టిన దాసరి నటుడిగా, రచయితగా, దర్శకుడిగా ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నారు. పరిశ్రమలో ఎందరికో ఉపాధిని కల్పించిన మహానుభావుడు ఆయన. వారికి పనిచ్చి, అన్నం పెట్టిన దేవుడు. ఇండస్ట్రీ 24 శాఖల కార్మికులకు ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరుండి పరిష్కరించారు.
కానీ ఇప్పుడు సమస్య వచ్చినా ఎవరూ పట్టించుకోరని ఓ కార్మిక పెద్ద అన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలీని శూన్యం ఉందిప్పుడు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు ఆడుతున్న వైనం ఇది అని ఓ చిన్న నిర్మాత వాపోయారు. నేడు దాసరి జయంతి. ఆయనను గుర్తుచేసుకుంటూ దాసరి శిష్యుల్లో ఒకరైన తుమ్మలపల్లి రామసత్యనారాయణ `దాసరి మెమోరియల్ అవార్డ్స్` కార్యక్రమం నిర్వహించారు. కార్మికుల్లో ప్రతిభావంతులకు ఈ పురస్కారాల్ని అందిస్తారట. ఇక ఈటీవీలో దాసరి జయంతి సందర్భంగా ఆయన తెరకెక్కించిన క్లాసిక్స్ 'కోరికలే గుర్రాలైతే', 'తూర్పు పడమర', 'సర్దార్ పాపారాయుడు', 'స్వప్న', 'రాముడు కాదు కృష్ణుడు' చిత్రాల్ని టెలీకాస్ట్ చేస్తున్నారు.