Phone Number: అమరన్ మూవీ యూనిట్‌పై కోర్టుకెళ్లిన కాలేజ్ స్టూడెంట్.. కోటికిపైగా నష్టపరిహారం డిమాండ్
College student Vaagesan sends legal notices to Amaran movie unit: అమరన్ మూవీలో హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ సాయి పల్లవి మధ్య జరిగిన ఒక లవ్ సీన్ రియల్ లైఫ్‌లో తన జీవితంతో ఆడుకుందని ఒక కాలేజ్ స్టూడెంట్ కోర్టు మెట్లెక్కారు. అమరన్ సినిమా దర్శకుడు, నిర్మాతల వల్ల తాను నరకం చూశానని ఆ విద్యార్థి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు.. తనపై వేధింపులకు కారణమైన మూవీ యూనిట్ నష్ట పరిహారంగా కోటి 10 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ స్టూడెంట్ ఎవరు? అమరన్ మూవీకి, ఆ విద్యార్థికి ఏం సంబంధం? ఆ సినిమా వల్ల భరించలేనంత మానసిక క్షోభ అనుభవించానని ఎందుకు అంటున్నారు అనేది తెలియాలంటే మనం ఇంకొంచెం డీటెయిల్స్‌లోకి వెళ్లాల్సిందే.
దీపావళి నాడు నరకం చూపించారు
దీపావళి సందర్భంగా అక్టోబర్ 31 నాడు అమరన్ మూవీ రిలీజ్ అయ్యింది. దేశం కోసం ప్రాణాలొదిలిన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమాకు ఆడియెన్స్ నుండి పాజిటవ్ రెస్పాన్స్ కనిపించింది. ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ నటించగా, ముకుంద్ భార్య ఇందు రెబెకా వర్ఘీస్ పాత్రలో సాయి పల్లవి కనిపించారు. ఇక ఈ సినిమాతో ఏ రకమైన సంబంధం లేని వాగీశన్ అనే యువకుడు ఆ రోజు తన కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంతలో ఉన్నట్టుండి వాగీశన్ ఫోన్ రింగ్ అయింది. కొత్త నెంబర్ నుండి ఎవరో ఫోన్ చేసి, హిరోయిన్ సాయి పల్లవి ఉన్నారా అని అడిగారు. నాన్సెన్స్.. నా దగ్గర హిరోయిన్ సాయి పల్లవి ఎందుకు ఉంటారు అని చెప్పి ఫోన్ పెట్టేసారు. క్షణం ఆలస్యం లేకుండా మరో ఫోన్ వచ్చింది.. ఈసారి మరో వ్యక్తి ఫోన్ చేసి మళ్లీ సాయి పల్లవి గురించే ఎంక్వైరీ చేశారు. వెంటనే ఇంకో ఫోన్ కాల్. ఇలా నాన్-స్టాప్‌గా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. అందులో కొందరు సాయి పల్లవి గురించి అడిగితే.. ఇంకొందరు అమరన్ మూవీలో సాయి పల్లవి పోషించిన ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు రెబెకా వర్ఘీస్ గురించి అడుగుతున్నారు.
సమయం గడుస్తున్న కొద్దీ ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. వాగీశన్‌ను కాలర్స్ క్షణం కూడా విడిచిపెట్టడం లేదు. ఎవరికైనా అత్యవసరంలో ఫోన్ చేద్దామనుకున్నా వారు ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదు. దీంతో మొదట్లో కొంత కూల్‌గానే సమాధానం చెప్పుకుంటూ వచ్చిన వాగీశన్‌కు ఆ తరువాత కోపం కట్టలు తెంచుకోవడం ఆరంభమైంది. అసలేం జరిగింది, తనకు సాయి పల్లవి గురించి, ముకుంద్ భార్య ఇందు రెబెకా వర్ఘీస్ గురించి తనకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని అదే కాలర్స్‌ని అడిగారు. అప్పుడు తెలిసింది అసలు విషయం.. అమరన్ మూవీలో హీరో, హీరోయిన్ మధ్య జరిగే ఒక సన్నివేశమే ఈ తలనొప్పికి కారణమని తెలిసింది.
వాగీశన్‌కు ఎందుకు కాల్ చేస్తున్నారు
ఆ సీన్‌లో హీరోకు హీరోయిన్ సాయి పల్లవి తన ఫోన్ నెంబర్ ఇస్తారు. సినిమాలో సీన్ కోసం హీరోయిన్ వాడిన ఆ ఫోన్ నెంబర్ నిజ జీవితంలో వాగీశన్ వాడుతున్న ఫోన్ నెంబర్ ఒక్కటే. అమరన్ మూవీ చూసిన వారిలో కొంతమంది నిజంగానే ఆ ఫోన్ నెంబర్ సాయి పల్లవిదే అయ్యుంటుందని పొరపడి ఆమెకు కాల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇంకొంతమంది ఆ ఫోన్ నెంబర్ ముకుంద్ భార్య ఇందు రెబెక వర్ఘీస్‌ది అనుకుని ఆమెకు ఫోన్ చేయసాగారు. కానీ అల్టీమేట్‌గా ఆ ఫోన్ కాల్స్ వెళ్తోంది మాత్రం సాయి పల్లవికి కాదు, ఇందు రెబెకాకు కాదు.. ఆ సినిమాతో ఏ సంబంధం లేని వాగీశన్‌కు ఆ ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
దర్శకుడు, నిర్మాతలు పట్టించుకోలేదు
ఈ విషయం తెలుసుకున్న వాగీశన్ నవంబర్ మొదటి వారంలోనే సోషల్ మీడియా ద్వారా అందరికీ ఒక అప్పీల్ చేశారు. "సినిమాలో చూపించినట్లుగా ఆ ఫోన్ నెంబర్ సాయి పల్లవిది కాదు.. ఇందు రెబెక వర్ఘీస్‌ది కాదు.. అది నా నెంబర్. దయచేసి ఎవ్వరు కూడా వారి కోసం ఫోన్ చేసి నన్ను వేధించొద్దు" అని ఆ పోస్టు ద్వారా కోరారు. అమరన్ మూవీ దర్శకుడు రాజేష్ పెరియస్వామి, నిర్మాత కమల్ హాసన్, నటుడు శివ కార్తికేయన్‌లను ట్యాగ్ చేసి వారిని కూడా స్పందించాల్సిందిగా కోరారు. కానీ అమరన్ మూవీ యూనిట్ నుండి ఎలాంటి స్పందన కనిపించలేదు.
కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన స్టూడెంట్
మరోవైపు తనకు ఫోన్ కాల్స్ రావడం ఆగలేదు. ఆ బాధ భరించలేక ఫోన్ స్విఛాఫ్ చేసేశానని, కానీ మళ్లీ ఫోన్ స్విఛాన్ చేయగానే మరుక్షణమే ఫోన్ కాల్స్‌తో వేధిస్తున్నారని వాగీశన్ కోర్టుకు మొరపెట్టుకున్నారు. మూవీ యూనిట్ సినిమా కోసం తన ఫోన్ నెంబర్ వాడి ఇబ్బంది పెట్టడం ఒక తప్పయితే.. తన ఇబ్బందిని వారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించకపోవడం వారు చేసిన రెండో తప్పుగా కోర్టుకు వివరించారు.
అమరన్ మూవీ యూనిట్ తన ఫోన్ నెంబర్‌ను హీరోయిన్ సాయి పల్లవి నెంబర్‌గా పబ్లిక్ చేశారు. ఇప్పుడు వారి కోసం తాను ఎందుకు ఫోన్ నెంబర్ మార్చుకుంటానని అన్నారు. పైగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ ఎకౌంట్.. ఇలా అన్నింట్లోనూ తను అదే ఫోన్ నెంబర్ వాడుతున్నందున ఆ నెంబర్‌ని మార్చడం కుదరదని తెగేసి చెప్పారు. అందుకే అమరన్ సినిమాలో తన ఫోన్ నెంబర్‌ను బహిర్గతం చేసిన సీన్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తనను మానసిక క్షోభకు గురిచేసినందుకు కోటి 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని అమరన్ మూవీ యూనిట్‌పై కోర్టులో ఫిర్యాదు చేశారు. ఏదేమైనా ఇదొక అరుదైన కేసుగా నెటిజెన్స్ చూస్తున్నారు. మరి ఇప్పుడు కోర్టు ఏమని స్పందించనుందా అనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.