Actress Kasthuri: సినీ నటి కస్తూరికి రిలీఫ్ ఇచ్చిన చెన్నై కోర్టు

Actress Kasthuri: తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీనటి కస్తూరికి ఊరట లభించింది.

Update: 2024-11-21 07:17 GMT

Actress Kasthuri: సినీ నటి కస్తూరికి రిలీఫ్ ఇచ్చిన చెన్నై కోర్టు

Actress Kasthuri: తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీనటి కస్తూరికి ఊరట లభించింది. చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ నెల 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగువారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయమై తమిళనాడులోని తెలుగు సంఘాలు పలు ప్రాంతాల్లో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కస్తూరిపై కేసులు నమోదు కావడంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. అయితే ఇంటికి తాళం వేసి కనిపించింది. ఫోన్ చేస్తే స్విఛాఫ్ వచ్చింది. ఆమె పరారీలో ఉన్నట్టు భావించిన పోలీసులు అప్పటి నుండే గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే కస్తూరి ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాశే ఎదురైంది. ముందస్తు బెయిల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఆ తరువాత కస్తూరి హైదరాబాద్‌లో ఉన్నారని తెలుసుకున్న చెన్నైలోని ఎగ్మోర్ పోలీసులు ఆమెను ఈ నెల 16 హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి తీసుకెళ్లి ఎగ్మోర్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. దీంతో మెజిస్ట్రేట్ ఆమెకు ఈనెల 29 వరకు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో ఆమెను పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే తాజాగా కస్తూరి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడంతో ఎగ్మోర్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.

నవంబర్ 3వ తేదీన చెన్నైలో బ్రాహ్మణ సంఘాల సమ్మేళనంలో కస్తూరి మాట్లాడుతూ తమిళ రాజుల అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమిళ జాతికి చెందిన వారని చెప్పుకుంటున్నారని అన్నారు. మరి శతాబ్దాలకు పూర్వమే ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులు తమిళ గుర్తింపును కోరుకోవడంలో తప్పేం ఉందని ప్రశ్నించారు. ఈ విషయంలోనే నటి కస్తూరి వ్యాఖ్యలపై తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు స్టేషన్లలో ఆమెపై ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News