Superstar Krishna: పద్మాలయ స్టూడియోలో కృష్ణ భౌతికకాయం
Superstar Krishna: మధ్యాహ్నం వరకు పద్మాలయ స్టూడియోలోనే కృష్ణ పార్థివదేహం
Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయన్ని నానక్‌రామ్‌గూడలోని నివాసం నుంచి పద్మాలయ స్టూడియోస్‌కు తరలించారు. అభిమానుల సందర్శనార్ధం కృష్ణ పార్థివదేహాన్ని మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలోనే ఉంచనున్నారు. ఆ తర్వాత అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తారు. 12 గంటల తర్వాత అంతిమయాత్ర మొదలు కానుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. పోలీసుల గౌరవవందనం తర్వాత అంత్యక్రియలు ముగుస్తాయి. అంతకు ముందు.. కృష్ణ అంతిమయాత్ర పద్మాలయ స్టూడియోస్ నుంచి మొదలవుతుంది. పద్మాలయ స్టూడియోస్ నుంచి మొదలయ్యే అంతిమయాత్ర జుబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా మహాప్రస్తానం వరకు సాగనుంది. దారి పొడవునా పార్ధివదేహాన్ని చూసేందుకు ఫ్యాన్స్ వస్తారన్న అంచనాతో భద్రతా పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళ్లు అర్పించేందుకు ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ రానున్నారు. పద్మాలయ స్టూడియోస్‌కు చేరుకొని పార్ధివదేహానికి నివాళి అర్పిస్తారు. హీరో మహేష్ బాబుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు సీఎం జగన్. కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించేందుకు ప్రముఖులు రానున్నారు. తమ అభిమాన నటుడు, అభిమాన నేతను కడసారి చూసి శ్రద్ధాంజలి ఘటించేందుకు పలువురు హైదరాబాద్‌కు వస్తున్నట్టు తెలుస్తోంది. పలువురు ప్రముఖులు నివాళులు అర్పించి.. కృష్ణతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. కన్నీటిపర్యంతమయ్యారు. కృష్ణ కుటుంబసభ్యులను పరామర్శించి.. ఓదార్చారు.