Singer Mangli: మంగ్లీ శివరాత్రి పాటపై వివాదం.. శ్రీకాళహస్తి ఆలయం లోపల పాట చిత్రీకరణపై భక్తుల మండిపాటు

Singer Mangli: మంగ్లీ ఆడిపాడితే ఆలయ అధికారులు పర్మిషన్ ఇవ్వడంపై ఆగ్రహం

Update: 2023-02-21 09:20 GMT

Singer Mangli: మంగ్లీ శివరాత్రి పాటపై వివాదం.. శ్రీకాళహస్తి ఆలయం లోపల పాట చిత్రీకరణపై భక్తుల మండిపాటు

Singer Mangli: సోషల్ మీడియాలో మిలియన్లకొద్ది జనాలను ఆకట్టుకుంటున్న మంగ్లీ తాజా డ్యాన్స్ వివాదాస్పదమవుతోంది. పండగలు, పర్వదినాలపై పత్యేక సాంగ్స్ చేస్తున్న మంగ్లీ.. ముక్కంటి సాక్షిగా నిబంధనలు తుగ్గలో తొక్కిందన్న విమర్శలొస్తున్నాయి. TTD పరిధిలోని SVBCకి సలహాదారునని సకలం మన కంట్రోల్ అనుకుందేమోగానీ శ్రీకాళహస్తి ఆలయ నిబంధనలు తుంగలో తొక్కింది. భక్తుల మనోభావాలతో ఆడుకుంది. దేశ, విదేశాల్లో పేరుగాంచిన ప్రముఖ గాయనీ గాయకులు ఎందరో ఈ వేదిక మీద నుంచి ప్రదర్శనలు ఇచ్చినా చేయని దుస్సాహసానికి మంగ్లీ పాల్పడింది.

ముక్కంటి ఆలయంలో అధికారుల పర్మిషన్ తీసుకున్నప్పటికీ ఆ నిబంధనలు కూడా మంగ్లీ తుంగలో తొక్కిందంటున్నారు భక్తులు. ఆలయంలో ఆడిపాడిన మంగ్లీ.. శివరాత్రి స్పెషల్ సాంగ్ చిత్రీకరించి యూట్యూబ్‌లో విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది. రెండు దశాబ్దాలుగా అనుమతి నిరాకరించిన ప్రాంతంలో ఆమె కెమెరాలను ఎగరేసి శివయ్యకే సవాలు విసిరిందని భక్తులు మండిపడుతున్నారు. ఆమె చేసిన దుస్సాహసంపై శివయ్య భక్తులు శివాలెత్తుతున్నారు. తిరుపతి జిల్లాలో దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో సినీ గాయకురాలు మంగ్లీ ఆటాపాట చిత్రీకరించడంపై దుమారం చెలరేగింది. ఈ ఆలయంలో రెండు దశాబ్దాల నుంచి వీడియో చిత్రీకరణకు అనుమతించడం లేదు. ప్రతి శివరాత్రికీ పరమశివుడిని కీర్తిస్తూ మంగ్లీ ఒక పాటను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు.

శ్రీకాళహస్తి ఆలయ అధికారులు పర్మిషన్ ఇచ్చినప్పటికీ... శివయ్య ప్రత్యేకతను పక్కన పెట్టి తన ఇమేజ్ కోసం మంగ్లీ చిత్రీకరించిందని భక్తులు కన్నెర్ర చేస్తున్నారు. భక్తులతో కిటకిటలాడే ప్రదేశాల్లో మంగ్లీ, ఆమె బృందం ఆడిపాడటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. సోమవారం యూట్యూబ్‌లో ఆ పాటను చూసిన శ్రీకాళహస్తివాసులు నివ్వెరపోయారు. ముక్కంటి ఆలయంలోని స్వామివారి సన్నిధి నుంచి నటరాజస్వామి విగ్రహం వరకు మధ్యలో ఉన్న ప్రదేశంలో మంగ్లీ నృత్యం చేసింది.

అలాగే, ఆలయంలోని కాలభైరవస్వామి విగ్రహం వద్ద, అమ్మవారి సన్నిధి నుంచి స్పటిక లింగం వరకు మధ్యభాగంలోనూ బృందంలో కలిసి ఆడిపాడింది. ఊంజల్ సేవా మండపంలో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చే చోట మంగ్లీ మరో ఇద్దరు యువతులతో కలిసి నృత్యం చేసింది. ఆ పక్కనే ఉన్న రాయలవారి మండపం, రాహుకేతు మండపాల్లో కూడా చాలా సేపు వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రోజూ సాయంత్రం 6 గంటలకు రాహుకేతు పూజలు ముగిసిన తరువాత మండపాన్ని మూసివేస్తారు. మంగ్లీ నృత్యం చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా మండపాన్ని తెరిచి సహకరించినట్లు తెలుస్తోంది. దీనిపై ఆలయ అధికారుల తీరు వివాదాస్పమైంది. మంగ్లీ వ్యవహారాల శైలిపైనే కాక, శ్రీకాళహస్తి ఆలయ అధికారుల నిర్లక్ష్యం బాధ్యతా రాహిత్యంపైనా శివయ్య భక్తులు మండి పడుతున్నారు. ఇటువంటి ప్రైవేట్ ఆల్బమ్‌లను ఆలయ అధికారులు పర్మిషన్ ఇవ్వడంపైనా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News