మరోసారి బుల్లితెర ఇండస్ట్రీలో కరోనా కలకలం.. తాజాగా ఓ సీరియల్ హీరోకి కరోనా పాజిటివ్
సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్స్ పై కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఈ మధ్యే ఓ బుల్లితెర నటుడికి వైరస్ సోకడంతో తాజాగా మరో నటుడు కూడా మహమ్మారి బారిన పడ్డాడు. దీంతో నటీనటులతో పాటుగా టీవీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నటులకు వైరస్ సోకుతుండడంతో సీరియల్స్ షూటింగ్స్ ఒక్కొక్కటిగా రద్దవుతుండడం కార్మికుల్లో గుబులు రేపుతోంది.
టీవీ పరిశ్రమలో కరోనా కలకలం సృష్టిస్తోంది. లాక్ డౌన్ అనంతరం ప్రారంభమైన సీరియల్స్ షూటింగ్స్‌కు వరుసగా బ్రేకులు పడుతున్నాయి. కోవిడ్ నిబంధనల ప్రకారం కొన్ని టీవీ సీరియల్స్ షూటింగ్స్ ఊపందుకున్నాయి. అంతా బాగానే సాగుతోంది. ఇంతలో పిడుగులాంటి వార్త. ఓ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానెల్ లో ప్రసారమయ్యే ఓ సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. మొదట ఆ నటుడికి జ్వరం, ఇతర లక్షణాలు కనిపించడంతో అనుమానంతో పరీక్షలు చేయించుకున్నాడు. టెస్టుల్లో అతనికి పాజిటివ్‌గా తేలడంతో అతనితో పాటు నటిస్తున్న ఇతర నటుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఆ సీరియల్ షూటింగ్ ను నిలిపివేసి యూనిట్ సభ్యులందరినీ క్వారెంటైన్‌కు తరలించారు.
ఇప్పటికే ఓ దర్శకుడికి కరోనా సోకగా తాజాగా ఓ సీరియల్ హీరోకు కూడా పాజిటివ్‌గా తేలింది. దీంతో టీవీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో సీరియల్ షూటింగ్‌లు రద్దవుతున్నాయి. సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ నెల 11వ తేదీ నుంచి కొన్ని సీరియళ్ల షూటింగ్స్ మొదలయ్యాయి. ఈ నెల 15వ తేదీ నుంచి దాదాపు అన్ని సీరియళ్ల షూటింగ్ లు హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యాయి. ఇంతలో నటుడికి కరోనా అనే వార్త టీవీ పరిశ్రమలో కలకలం రేపింది. టీవీ సీరియల్స్ కు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. కరోనా ఉధతితో మహిళా ప్రేక్షకులను అలరించే బుల్లితెర సీరియల్స్ మళ్లీ ఆగిపోతాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
లాక్ డౌన్ 5వ దశలో సడలింపుల తర్వాత సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్‌ను కలిసి సినీ, టీవీ షూటింగులకు అనుమతి పొందారు. అయితే షూటింగ్ లకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. భౌతిక దూరం, మాస్కులు, శానిటైజేషన్, పీపీఈ కిట్లు ధరించడం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెప్పింది. పరిమిత సంఖ్యలో సిబ్బందితో ఇండోర్ లో మాత్రమే షూటింగ్స్ చేసుకోవాలంది. ఆ నిబంధనలు, మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగ్స్ చేస్తున్నా కరోనా సోకడం షాక్ కి గురి చేస్తోంది.
కొందరు సీరియల్ నటులు మాత్రం ఇప్పుడు షూటింగ్స్‌కు రాలేమని నిర్మాతలకు తేగేసి చెబుతున్నారు. బయట పరిస్థితులు అర్థం చేసుకోవాలంటూ వాళ్లకు అర్జీ పెట్టుకుంటున్నారు. అందులో కొందరు అనుమతులు కూడా ఇస్తున్నారు. మొత్తానికి సినిమాలపైనే కాదు ఇప్పుడు బుల్లితెరపై కూడా కరోనా ప్రభావం భారీగానే పడుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో టీవీ సీరియల్స్ షూటింగ్స్ ని ఆపేయడమే మంచిదని మెజారిటీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ భయంతోనే ఈ మధ్యే ప్రారంభించిన సినిమా షూటింగ్‌లు కూడా ఆపేస్తున్నట్టు చెబుతున్నారు.