RIP Balasubrahmanyam : పాటకు పందిరి వేసిన స్వరార్చకునికి ఓ అభిమాని అందించిన అక్షరమాల చిత్తరువు!
SP Balasubramaniam Songs : తెలుగు సినిమా పాట అంటే అందులో ముప్పాతిక శాతం ఆయన గురించే చెప్పుకోవాలి.. 1966లో ఓ పాటతో మొదలైన అయన ప్రయాణం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ స్వరం భారత సినిమాపై చెరిగిపోని సంతకం.. చేర్పలేని జ్ఞాపకం!
SP Balasubramaniam Songs : తెలుగు సినిమా పాట అంటే అందులో సగం అయన గురించే మనం చెప్పుకోవాలి.. 1966లో ఓ పాటతో మొదలైన అయన ప్రయాణం ఎక్కడికో వెళ్ళిపోయింది. అయన తర్వాత ఎంతో మంది గాయకులూ వచ్చారు.. వస్తూనే ఉన్నారు.. కానీ అందరకి అయన స్ఫూర్తి.. ఏడుపదుల వయసులో కూడా ఎంతో యాక్టివ్ అయన తన గాత్రంతో అలరించారు.. ఆ పాట అంటే ఆయనే పాడాలి.. అయన పాడితేనే ఆ పాటకి ఓ అందం వస్తుంది.. అసలు ఆ పాట ఆయన కోసమే పుట్టిందా అన్నట్టుగా ఉంటుంది.. అలా ఒక భాష నుంచి ఒక పాట నుంచి దాదాపుగా 16 భాషల్లో 40వేలకి పైగా పాటలు పాడి చాలా మంది అభిమానులని సొంతం చేసుకున్నారు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం.. ఆయనే మనం ముద్దుగా పిలుచుకునే ఎస్పీ బాలు..
ప్రస్తుతం అయన మన మధ్య భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు.. కానీ అయన అందించిన పాటలతో తెలుగు సినిమా సంగీతం బతికి ఉన్నన్నాళ్ళు మనతోనే ఉంటారు. అయన గుండె ఆగిపోయింది కావచ్చు కానీ అయన గొంతు అగలేదు.. అయన అద్భుతమైన గాత్రంతో కొన్ని పాటలకి జీవం పోశారు. అందులోని కొన్ని పాటలను ఇప్పడు చూద్దాం..
శంకరాభరణం.. పూర్తిగా శాస్త్రీయ సంగీతంతో తెరకెక్కిన చిత్రం.. శాస్త్రీయ సంగీతంతో పాటలా నా వాళ్ళ కాదు బాబోయ్ అని ముందుగా బాలు అన్నారట. కానీ సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ అసిస్టెంట్ పుగలేంది బాలును తీసుకువచ్చి " శంకరా నాదశరీరాపరా" అనే పాటను పాడించారు. ఇప్పటికే ఆ పాట వింటే మనకి ఒళ్ళు జలదరిస్తుంది. బాలు బెస్ట్ సాంగ్స్ లో ఈ పాట టాప్ లోనే ఉంటుంది. ఈ పాటను వేటూరి సుందరరామమూర్తి రాశారు. ఈ పాటకి గాను ఎస్పీ బాలుకి జాతీయ అవార్డు రావడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు..
ఇక రుద్రవీణ.. ఇది కూడా సంగీత ప్రధానమైన చిత్రం కావడం విశేషం.. ఇళయరాజా సంగీత సారధ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఎస్పీ బాలు మూడు పాటలను పాడారు.. అవే.. "తరలి రాదా తనే వసంతం.. తన దరికిరాని వనాలకోసం", నమ్మకు నమ్మకు ఈ రేయిని.. కమ్ముకు వచ్చిన ఈ మాయని" చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా.. చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా" .. ఈ పాటలకి గాను ఎస్పీ బాలుకి మరోసారి జాతీయ అవార్డు లభించింది.
అటు సంగీత ప్రధానమైన చిత్రాలు మాత్రమే కాదు.. ప్రేమ గీతాలు, విరహ గీతాలు పాడడంలోను బాలు అయనకి ఆయనే పోటి.. వెంకటేష్ హీరోగా వచ్చిన ప్రేమ చిత్రంలో " ప్రియతమా నా హృదయమా" అనే ప్రేమ విరహ గీతాన్ని పాడి శభాష అనిపించారు బాలు.. ఇప్పటికి ఈ పాట ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి... ఇళయరాజా స్వరకల్పనలో వచ్చిన ఈ పాటను ఆచార్య ఆత్రేయ రాశారు.
మేజర్ చంద్రకాంత్ అంటే టక్కున గుర్తొచ్చేవి రెండే రెండు.. ఒకటి అన్న ఎన్టీఆర్, కాగా రెండోది బాలు పాడిన పుణ్యభూమి నా దేశం నమో నమామీ.. ధన్య భూమి నా దేశం సదా స్మరామీ" అనే పాట.. ఈ పాట విన్నప్పుడల్లా మనలోని దేశభక్తిని మరింతగా పెంచుతుంది. కీరవాణి సంగీత సారధ్యంలో వచ్చిన ఈ పాటను జాలాది రాజా రావు రాశారు.. ఈ పాటకి ప్రాణం పోశారు బాలు..
ఇది బాలునే పాడాలి... ఇది బాలుకోసమే పుట్టిన పాట అనిపించే మరో పాట ఠాగూర్ చిత్రంలోని "నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను".. రుద్రవీణ చిత్రంలో చిత్రీకరించిన శ్రీశ్రీ గీతం నేను సైతం ఈ చిత్రంలో కూడా కొంత మార్పులతో చిత్రీకరించబడ్దది . ఈ సినిమాలో గీతాన్ని సుద్దాల అశోక్ తేజ వ్రాశారు.. మణిశర్మ సంగీతం అందించారు.. మొదటి చరణం మాత్రం యధాతధంగా మహా ప్రస్థానంలోని శ్రీశ్రీ గీతం నుండి తీసుకున్నారు. ఆ తరువాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ఈ పాట కొంత మార్పులతో ప్రచారగీతంగా వాడబడింది.
మనషి పోయేముందు ఓ నలుగురు తనని మంచివాడిగా గుర్తుపెట్టుకోవాలని చెప్పే "ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల" అనే పాటని ఆ నలుగురు చిత్రంలో పాడారు బాలు.. సినిమా మొత్తం ఒకెత్తు అయితే ఇందులో బాలు పాడిన ఈ ఒక్క పాట ఒకెత్తు...వింటున్నంతసేపు జీవితం మొత్తం కళ్ళకి కనిపిస్తుంది. ఆర్పీ పట్నాయక్ స్వరకల్పనలో వచ్చిన ఈ పాటని చైతన్య ప్రసాద్ రాశారు. బాలు బెస్ట్ సాంగ్స్ లో ఈ పాట టాప్ లో ఒకటిగా నిలుస్తోంది.
ఇలా చెప్పుకుంటే పోతే కొత్త బంగారు లోకం చిత్రంలో నీ ప్రశ్నలు నీవే ఎవరు బదులు ఇవ్వరుగా, రోజా చిత్రంలో నా చెలి రోజావే, నాలో ఉన్నావే, శుభలగ్నం చిత్రంలో చిలుక ఏ తోడు లేకా, అన్నమయ్య చిత్రంలోని అన్ని పాటలు, మంచి మనుసులో జాబిల్లి కోసం ఆకాశమల్లె, స్వాతిముత్యంలో సువ్వి సువ్వి, అందమైన అనుభవం లోని కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో మరెన్నో పాటలు ప్రేక్షకులను అలరించాయి.. ఇంకా అలరిస్తూనే ఉన్నాయి..ఉంటాయి కూడా..
ఆయన పరమపదించిన క్షణాన ఓ అభిమాని అయన పాటల అక్షరాలతో అయన చిత్తరువును రూపొందించాడు. అందరికీ ప్రియమైన బాలూకి విజయవాడకు చెందిన జోస్యుల వేణుగోపాల్ అనే ఆ అభిమాని అందించిన ఈ నివాళి ఎంత గొప్పగా ఉందొ కదా!