Rewind the Movements 'నువ్వే కావాలి' విజయం వెనుక కథ
కోట్లు ఖర్చుపెట్టినా కొన్ని సినిమాలు చూసిన వాళ్ళనీ, తీసిన వాళ్ళనీ కూడా ఉసూరుమనేలా చేస్తాయి. కొన్ని సినిమాలు సైలెంట్ గా వైలెంట్ గా కలెక్షన్లు కొల్లగోట్టేస్తాయి. అటువంటి సినిమా నువ్వేకావాలి. ఒక నిర్మాత మంచి సినిమా తీయాలని తపన పడితే.. దానికి అదిరిపోయే కథ కుదిరితే.. అది రీమేకైనా సరే ఎక్కడా తడబాటు లేకుండా అచ్చ తెలుగు సినిమా అనిపించేలా స్క్రీన్ ప్లే కుదిరితే.. గుండెల్ని మెలేసే ఎమోషన్ కి పంచదార లాంటి కామెడీతో పూత పూస్తే.. అది కుర్రకారు కథ అయితే.. ఇంకేముంది అది తప్పకుండా 'నువ్వేకావాలి' అవుతుంది!
చాలా సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోతాయి . టీవీలో ఎప్పుడైనా అ సినిమా తాలుకు పాట వచ్చినా, ఓ సన్నివేశం వచ్చినా అలాగే అతుక్కుపోయి మరి చూస్తారు. అలాంటి సినిమాలలో తరుణ్ , రిచా కలిసి నటించిన " నువ్వే కావాలి" కూడా ఒకటి .. ఈ సినిమా 2000 సంవత్సరంలో విడుదలై ఉహించిన దానికంటే ఎక్కువ విజయాన్నే అందుకుంది . మరి ఈ సినిమా ఇంత పెద్ద హిట్టు కావటం వెనుక పెద్ద కథే ఉంది. సినిమా యూనిట్ పడ్డ పడిన కష్టమూ ఉంది..ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం..
తెర వెనుక కథ : -
సినిమా ఇండస్ట్రీలోకి స్రవంతి రవికిషోర్ ఓ నాలుగు డబ్బులు వేనుకేసుకుందాం అని వచ్చిన దానికంటే చెప్పుకోడానికి ఓ నాలుగు సినిమాలు ఉంటే బాగుంటుంది అన్న ఇంట్రెస్ట్ తోనే వచ్చారు అనిపిస్తుంది . రౌడీ మొగుడు,లింగబాబు లవ్ స్టోరీ సినిమాలు ఆయనని దెబ్బతీశాయి. అ తర్వాత వచ్చినా మావి చిగురు,ఎగిరే పావురమా సినిమాలు మంచి విజయాన్ని ఇచ్చాయి . ఇక గిల్లికజ్జాలు, మనసులో మాట, పిల్ల నచ్చింది సినిమాలు పర్వాలేదు అనిపించాయి. చెప్పుకోడానికి ఓ బడా హిట్టుకోసం స్రవంతి రవికిషోర్ చేయని ప్రయత్నం లేదు ...
ఇలాంటి టైంలో "నిరమ్" అనే ఓ మలయాళ చిత్రం ఆయనని బాగా ఇంప్రెస్ చేసింది. చాలా కష్టపడి తక్కువ ధరలో నిరమ్ సినిమా రీమేక్ హక్కులను కొనేసాడు రవికిషోర్ .. ఇక సినిమాని స్టార్ట్ చేయాలి. కానీ అనుకున్న దానికంటే ఎక్కువే ఖర్చు వస్తుంది . ఇలాంటి టైంలో ఉషాకిరణ్ మూవీస్ తో కలిసి సినిమా చేయలని ఓ ప్రపోసల్ కూడా ఉంది. దీనితో ఓసారి రామోజీరావును కలిసి ' నిరమ్ ' చూపించారు రవికిషోర్. అయనకి కూడా ఆసినిమా బాగా నచ్చేసింది . ఇక బడ్జెట్ ఉషాకిరణ్ మూవీస్ దే , ఎగ్జిక్యూషన్ అంతా రవికిషోర్ ది ...
మంచి కథ ఉన్న సినిమా హక్కులు రెడీ, నిర్మాత రెడీ ఇప్పుడు హీరో , దర్శకుడు కావాలి. ముందుగా హీరో తేలాలి అ తర్వాత డైరెక్టర్ పని అనుకున్నారు రవికిషోర్. సినిమాని ఓ యంగ్ హీరోను పెట్టి తీయాలి. అప్పుడే లాభాలు వస్తాయి . మహేష్ , సుమంత్ అందరిన్ని ట్రై చేసారు. కానీ కుదరలేదు . ఇక ఇదంతా కాదు కొత్తవాళ్ళని పెట్టె సినిమా చేద్దాం అనుకున్నాడు. కానీ ఓ సారి టీవీలో ఓ కుర్రాడు కనిపించాడు . చూడడానికి బాగున్నాడు కూడా ఎవరు అని ఎంక్వయిరీ చేస్తే సీనియర్ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజారమణి కొడుకు అని తెలిసింది . పైగా చైల్డ్ ఆర్టిస్ట్ కూడా .. ఆమెకి వెళ్లి "నిరమ్" అనే సినిమా చూపిస్తే ఆమెకి బాగా నచ్చి తరుణ్ కి ఇదే బెస్ట్ డెబ్యు అని ఒకే చేసేసింది . ఇక హీరోయిన్ కోసం వెతుకులాటలో పడ్డారు. ఫైనల్ గా రిచాని ఒకే చేసారు . ఇంకో హీరోగా సాయికిరణ్ ని సెలెక్ట్ చేసారు .
ఇక దర్శకుడిగా విజయభాస్కర్ ని ఒకే చేసారు . అప్పటికే విజయభాస్కర్ స్వయంవరం అనే సినిమా చేసాడు . అ సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్స్ రాశాడు. అందులో డైలాగ్స్ కి ఆయనకి మంచి పేరు వచ్చింది . త్రివిక్రమ్ ని పిలిపించి కథ చెప్పగానే రెండు మూడు సీన్స్ చెప్పాడు త్రివిక్రమ్ . అతని టాలెంట్ గుర్తించిన రవికిషోర్ త్రివిక్రమ్ కు వెంటనే పాతిక వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. త్రివిక్రమ్ తన కామెడి టైమింగ్ తో స్క్రిప్ట్ పక్కాగా రెడీ చేసేసాడు .
సినిమా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు అయినా ఉషాకిరణ్ మూవీస్ వెనుకడుగు వేయలేదు. క్వాలిటీ ఎక్కడా తగ్గకుండా రవికిషోర్ చూసుకున్నారు. రీమేక్ సినిమా అయినా, ఆ వాసనే ఈ సినిమాకి కనబడలేదు.అది త్రివిక్రమ్ స్క్రిప్ట్ గొప్పతనం. కథ తోపాటూ సాగిన పాటలు.. కామెడీ.. ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేశాయి. ఒక కమిట్ మెంట్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో దానికి నువ్వేకావాలి మంచి ఉదాహరణగా నిలిచింది.
ఈ సినిమానే కావాలి అని ప్రేక్షకులు మెచ్చిన సినిమా ముచ్చట్లు మరికొన్ని..
----> ఈ సినిమాకి కోటి సంగీతాన్ని అందించారు . ' సిరివెన్నెల ' సీతారామశాస్త్రి, భువనచంద్ర పాటలు రాశారు .
---> కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు, అనగనగా ఆకాశం ఉంది సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది .
----> ఫస్ట్ డే షూటింగ్ కి తరుణ్ కి వైరల్ ఫీవర్. 104 డిగ్రీల జ్వరం. కదల్లేని పరిస్థితిలో కూడా షూటింగ్ కి వచ్చాడు .
----> సినిమా మొత్తాని ముందుగా 75 లక్షల బడ్జెట్ అనుకున్నారు. కానీ కోటి 20 లక్షలు ఖర్చు అయింది .
----> 2000 అక్టోబర్ 13న చాలా తక్కువ ప్రింట్లతో, తక్కువ థియేటర్లలో ' నువ్వే కావాలి ' సినిమా రిలీజ్ అయింది .
----> సినిమా దియేటర్లో ఒక్కో పాటకి యూత్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఓన్లీ సాంగ్స్ ప్రొజెక్ట్ చేయమని ఒకటే గొడవ కూడా . ఇక త్రివిక్రమ్ డైలాగ్స్ కి నవ్వులే నవ్వులే
----> బాక్స్ ఆఫీస్ ని ఈ సినిమా షేక్ చేసింది . మొత్తం మీద 24 కోట్లును వసూలు చేసింది.
----> ఈ సినిమా నిర్మాతగా స్రవంతి రవికిషోర్ కు పెద్ద బ్రేక్ ఇచ్చింది .
----> మళ్ళీ ఇదే టీంతో కలిసి రవికిషోర్ " నువ్వు నాకు నచ్చావ్ " అనే సినిమాని తెరకెక్కించారు .
----> ఇక ఈ సినిమాలో చేసిన తరుణ్ యాంగ్ హీరోల్లో ఒక పెద్ద హీరోగా మొదటి సినిమాతోనే నిలబడిపోయాడు.