Real Hero Sonu Sood: రియల్ లైఫ్‌లో సుప్రీం హీరో.. ప్రస్తుతం మరో మిషన్ ను పూర్తి చేసే పనిలో సోనూసూద్..

Update: 2020-07-29 09:54 GMT

Real Hero Sonu Sood: రీల్‌ లైఫ్‌లో నెగెటివ్‌ షేడ్స్‌.. రియల్‌ లైఫ్‌లోకి వచ్చేసరికి రియల్‌ హీరో. అవును కరోనా కష్టకాలంలో కలియుగ కర్ణుడి అవతారమెత్తారు సోనూసూద్‌. అరుంధతి, దూకుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సోనూసూద్ నటుడిగా నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఎక్కువగా చేసినా నిజ జీవితంలో మాత్రం చాలా మంది జీవితంలో హీరో పాత్ర పోషించాడు. వలస కార్మికులను స్వంత స్థలాలకు పంపించడమే కాకుండా తాజగా మదనపల్లెలో అక్కాచెల్లెళ్లకు ట్రాక్టర్‌ అందించే దాకా రియల్‌ హీరోగానే కనిపించాడు.

సోనూసూద్‌. రీల్ లైఫ్‌లో విలనే. కానీ లాక్‌డౌన్ సమయంలో రియల్‌ హీరోగా మారిపోయాడు. వేల మంది వలస కార్మికులను స్వస్థలాలకు పంపించి రియల్ లైఫ్‌లో సుప్రీంహీరో అయ్యారు. వలస కూలీల కష్టాలకు చలించిపోయి సొంత డబ్బుతో వారిని ఇళ్లకు చేర్చి ప్రశంసలు పొందారు. అది అక్కడితో ఆగిపోలేదు. లాక్‌డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న దాదాపు 1500 మంది విద్యార్థులను ఇండియాకు తరలించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాలు స్పందించేలోపే బస్సులు ఏర్పాటు చేసి వారిని సొంత గూటికి పంపించారు. ప్రతీ వలస కార్మికుడు తమ ఇంటికి చేరే వరకు ఆగేది లేదు అనే సంకల్పంతో రంగంలోకి దూకాడు ఈ రియల్ హీరో.

వలస కార్మికుల విషయంలోనే కాదు సమస్యల్లో ఉన్న ఎవరైనా సహాయం అడిగితే కాదు లేదు అనకుండా వెంటనే చేసి పెట్టడం సోనూ సూద్ స్పెషాలిటీ అలా సహాయం అడిగిన ఒక చిన్నారికి ఇక మీ ఇంటిపైకప్పు నుంచి ఇక నీరు కారదు అని చెప్పి చూపించాడు సోనూసూద్. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఒక రైతు కుటుంబానికి సాయం చేసి మళ్లీ తన గొప్పతనం చాటుకున్నారు సోనూసూద్.

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబునాయుడు కూడా సోనూసూద్ చేసిన మంచిపనిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. తన వంతుగా రైతు కుటుంబానికి సహాయం చేస్తానన్నారు చంద్రబాబు. ఎవరు సాయం అడిగినా ఎస్ అని వెంటనే చేసి చూపించడం సోనూసూద్ ప్రత్యేకత. ఇలా ఎంతో మంది జీవితాల్లో వెలుగు తీసుకొచ్చిన సోనూసూద్ ముంబై లోని తన హోటల్ మొత్తం కరోనావైరస్ సోకిన పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించే వైద్యులు, సిబ్బందికి కేటాయించారు. వలస కార్మికులు తమ ఇంటికి వెళ్లేలా చేయడమే కాదు వారికి ఉపాధి కల్పించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ రియల్ హీరో. ప్రస్తుతం మరో మిషన్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు సోనూసూద్.

Tags:    

Similar News