Jani Master: జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్.. కారణం ఏంటంటే..?
Bail To Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు.
Bail To Jani Master: జానీ మాస్టర్ కు ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది కోర్టు. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగికదాడి కేసులో జానీ మాస్టర్ ను ఈ ఏడాది సెప్టెంబర్ 19న గోవాలో అరెస్ట్ చేశారు. ఔట్ డోర్ షూటింగ్ సమయంలో, వ్యానిటీ వ్యాన్ లో కూడా తనపై ఆయన పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నార్సింగి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ఆయన ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. అయితే నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. జానీ మాస్టర్ కు బెయిల్ ఇవ్వవద్దని కోర్టును పోలీసుల తరపు న్యాయవాది కోరారు. నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదనలను జానీమాస్టర్ న్యాయవాది తోసిపుచ్చారు. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం న్యూదిల్లీకి వెళ్లాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కోరారు. దీంతో ఈ నెల 6 నుంచి 10 వరకు జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతిని ఇచ్చింది.
జానీ మాస్టర్ ను నాలుగు రోజుల పాటు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు పోలీసులు ఆయనను ప్రశ్నించారు. పోలీసుల విచారణలో కీలక విషయాలను జానీమాస్టర్ చెప్పారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఫిర్యాదు చేసిన యువతే తనను మానసికంగా వేధింపులకు గురి చేసిందని పోలీసుల విచారణలో ఆయన చెప్పారని సమాచారం.