Rana Daggubati: 400 గిరిజన కుటుంబాలకు అండగా రానా దగ్గుబాటి
Rana Daggubati: 400 గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మెడిసిన్స్ అందించి పెద్దమనస్సు చాటుకున్నాడు హీరో రానా.
Rana Daggubati: కృష్ణం వందే జగద్గురం సినిమాలో గిరిజనుల తరపున, గిరిజనుల కోసం పోరాడతారు రానా దగ్గుబాటి. ఇప్పుడు నిజంగానే గిరిజనులకు అండగా నిలబడటానికి ముందుకొచ్చారు రానా. కరోనా సంక్షోభంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గిరిజన కుటుంబాలకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. 400 గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మెడిసిన్స్ అందించి ఆదుకుని... అభినందనలు పొందుతున్నారు రానా దగ్గుబాటి.
ప్రాథమిక అవసరాలకు కూడా ఇబ్బందులు పడుతున్న తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని గిరిజన కుటుంబాలకు తనవంతుగా రానా సహాయం చేశారు. అందులో భాగంగా వంటకు సంబంధించిన కిరాణ సామాగ్రితో పాటు మందులను అందించారు. నిర్మల్ జిల్లాలోని అల్లంపల్లి, బాబా నాయక్ రాండా గ్రామ పంచాయతి, గుర్రం మధిర, పాల రేగడి, అద్దాల తిమ్మపూర్, మిసాల భూమన్న గూడెం, గగన్నపేట, కనిరాం తాండా, చింతగూడెం వంటి గిరిజన గ్రామాలకు చెందిన కుటుంబాలకు రానా ఈ సహాయం అందించారు.
ఇక రానా సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల అరణ్య అనే సినిమాతో వచ్చారు. ఈ సినిమాలో అడవి, అడవి జంతువుల నేపథ్యంలో వాటి హక్కులు రక్షణ గురించి చర్చించారు. ఇక ఆయన ప్రస్తుతం విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో పాటు విశ్వశాంతి పిక్చర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి ఆయన అంగీకరించారు. సీహెచ్ రాంబాబుతో కలిసి విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపినాథ్ ఈ సినిమాను నిర్మించనున్నారు.