Rakul Preet Singh: ఎన్ని కష్టాలొచ్చినా ముందుకు సాగాల్సిందే.. రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rakul Preet Singh: కన్నడ చిత్రం ‘గిల్లీ’తో ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్.. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకుంది.

Rakul Preet Singh: కన్నడ చిత్రం ‘గిల్లీ’తో ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్.. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకుంది. తెలుగులో 2013లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో తొలి విజయాన్ని అందుకున్న ఈ చిన్నది వరుస అవకాశాలను దక్కించుకుంది. టాలీవుడ్‌లో ఉన్న యంగ్ టాప్ హీరోల సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అదే విధంగా మంచి విజయాలను సైతం తన ఖాతాలో వేసుకుంది.
ఇక జాకీ భగ్నానీతో వివాహం తర్వాత కూడా సినిమాలను కొనసాగిస్తోందీ చిన్నది. కాగా రకుల్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్లు గడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ బ్యూటీ. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ.. ఈ సినీ జీవితంలో ఎన్నో ఎత్తులూ, పతనాలూ ఎదురైనా.. ప్రతి దాన్ని ఓ అనుభవంగా తీసుకుంటూ ముందుకు సాగానన్నారు.
‘‘ఈ రంగంలో విజయాలు, పరాజయాలు సహజం. ప్రతి ఒక్కరికి ఎదురయ్యే పాఠాలే ఇవి. కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకూడదు. ఆ కష్టాలే మనల్ని బలంగా తయారుచేస్తాయి. నాకు బిజీగా ఉండడం అంటే చాలా ఇష్టం. నా జీవితంలో ప్రశాంతత అనేది పని మధ్యలోనే దొరుకుతుంది. షూటింగ్‌ల మధ్యన పని లేకుండా ఖాళీగా ఉన్నపుడు కానీ ఒత్తిడిగా అనిపించదు. కెమెరా ముందుండటమే నాకు జీవనవిధానం అయిపోయింది. ప్రతిరోజూ సెట్స్‌కి వెళ్లి పని చేయడం జీవితంలో భాగంగా మారిపోయింది. ఇదే దినచర్య నాకు ప్రేరణ ఇస్తుంది. ఇదే కొనసాగాలని ఆశిస్తున్నాను,’’ అని ఆమె అన్నారు.
ఇదిలా ఉంటే ఇటీవలే ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు ఆమె భర్త జాకీ భగ్నానీ నిర్మాతగా వ్యవహరించటం విశేషం. ప్రస్తుతం అజయ్ దేవ్‌గణ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘దే దే ప్యార్ దే 2’ చిత్రంలో రకుల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాకుండా నితేశ్ తివారీ రూపొందిస్తున్న ‘రామాయణ’ చిత్రంలో శూర్పణఖ పాత్రకు ఎంపికయ్యారన్న వార్తలు సినీవర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.