R Narayana Murthy: పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి తన సినిమాలతో సమాజంలో సమకాలిన సమస్యలపై తన పాటలతో, సినిమాలతో ప్రజలను మేల్కొలిపే విలక్షణ నటుడు. ఎర్రజెండా అంటూ పాట పాడిన, ఎర్ర సైన్యం, దండోరా, ఊరు మనదిరా వంటి సినిమా తీసిన రాజకీయ, భూదోపిడీ, నిరుద్యోగం, పర్యావరణ సమస్యలపై పోరాటాలు చేసే చిత్రాలను తెరకెక్కించిన ఆర్ నారాయణ మూర్తి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు బంధువే. నిరాడంబరంగా, అందరితో ఆత్మీయంగా ఉండే ఆర్ నారాయణ మూర్తిపై తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు గద్దర్ చేసిన కొన్ని వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన చెప్పుకొచ్చాడు.
తను ఇంటి అద్దె కూడా కట్టని పరిస్థితుల్లో ఉన్నానని, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నట్టు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో రావడం పూర్తిగా అవాస్తవాలని, తనకి పల్లెటూరి వాతావరణంలో ఉండటం ఇష్టం కాబట్టే హైదరాబాద్ కి దూరంగా ఉంటున్నాని తనకి ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేవని తెలిపాడు. ప్రస్తుతం తనకి సరిపడా సంపాదించుకొన్నానని అందులో నుండి అవసరం ఉన్నంత వరకే సేవా కార్యక్రమాలు చేయడానికి ఖర్చు చేస్తానని తెలిపాడు. ఎన్ని డబ్బులు ఉన్న తనకి సాధారణ జీవితం అంటేనే ఇష్టమని అందుకొరకు హంగులు ఆర్భాటాలు తనకి ఇష్టముండదని మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు. తనకి బయటి దేశాల నుండి ఎంతో మంది అభిమానులు తాను బాధల్లో ఉన్నానని అవాస్తవాలు విని తనకి ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్తుండటం తనకి కన్నీళ్ళు తెప్పించాయని ఆర్ నారాయణ మూర్తి మీడియా ముందు బాధపడ్డాడు. సోషల్ మీడియా వేదికగా తమ పాపులారిటీ కోసం ఎలాంటి అవాస్తవాలను రాయవద్దని కోరుతున్నట్టు ఆర్ నారాయణ మూర్తి మీడియా ముఖంగా తెలిపాడు.