Pushpa 2: తగ్గేదెలే అంటున్న పుష్పరాజ్.. హిందీలో మరో అరుదైన రికార్డ్‌

Update: 2024-12-15 10:07 GMT

Pushpa 2 Movie Hindi Collections: ఓవైపు పుష్ప 2 చిత్రానికి సంబంధించి వివాదం నడుస్తూనే ఉంది. మరో వైపు, పుష్ప రాజ్‌ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. సంధ్య థియేటర్‌లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో అల్లు అర్జున్‌ అరెస్ట్‌ కావడం ఒక రాత్రంతా జైల్లోనే ఉండడం హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే మరోవైపు ఈ వివాదంతో సంబంధం లేకుండా పుష్ప రికార్డుల వేట సైతం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన పుష్ప 2 మూవీ తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

హిందీ మార్కెట్లో పుష్ప 2 దూసుకుపోతోంది. కేవలం 10 రోజుల్లోనే హిందీ మార్కెట్‌లో పుష్ప 2 సరికొత్త రికార్డును తిరగరాసింది. ఇప్పటి వరకు ఈ సినిమా హిందీ మార్కెట్‌లో రూ. 507.50 కోట్ల నెట్‌ కలెక్షన్లను రాబట్టింది. హిందీలో అత్యంత వేగంగా రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా పుష్ప2 నిలిచింది. ఈ విషయాన్ని పుష్ప2 చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్‌ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది.

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఎర్ర చందనం సిండికేట్‌గా నాయకుడిగా ఎదిగిన తర్వాత పుష్ప జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి. ఒక చిన్న ఫొటో విషయంలో తలెత్తిన సమస్య కోసం పుష్ప రాజ్‌ ఏం చేశాడు. ఆ క్రమంలో తాను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, పుష్పను ఎదురించడానికి భన్వర్‌ సింగ్ షికావత్‌ (ఫహాద్‌ ఫాజిల్‌) ఏం చేశాడు. చివరికి పుష్ప అనుకున్నది సాధించాడా.? లేదా అన్న కథాంశంతో సుకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విడుదలైన అన్ని చోట్ల సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది.

విడుదలకు ముందే ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తోనే రికార్డులను తిరగరాయడం మొదలుపెట్టిన పుష్ప2 విడుదల తర్వాత ఓవర్‌సీస్‌తో పాటు ఇండియన్‌ మార్కెట్‌లో వసూళ్ల సునామీని సృష్టించింది. కేవలం 10 రోజుల్లోనే రూ. 1000 కోట్ట మార్క్‌ను అందుకుని విజయవంతంగా దూసుకుపోతోంది. కాగా ఈ వీకెండ్ కూడా ఎలాంటి సినిమాలు విడుదల లేకపోవడంతో పుష్ప2 హవా మరింత కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా పుష్ప2 3డీ వెర్షన్‌ను కూడా చిత్ర యూనిట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు థియేటర్లలో 3డీ వెర్షన్‌ అందుబాటులోకి రాగా త్వరలోనే దేశవ్యాప్తంగా దీనిని ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. 

Tags:    

Similar News