Sid Sriram: ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ కు పబ్ లో అవమానం
Sid Sriram: ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ కు హైదరాబాద్ లో అవమానం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Tollywood: "నీలి నీలి ఆకాశం, సామజ వరగమన, ఉండి పోరాదే" అంటూ సూపర్ హిట్ సినిమా పాటలకు గాత్రం అందించిన సిద్ శ్రీరామ్ కు హైదరాబాద్ లోని ఓ పబ్ లో అవమానం జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే...ఇటీవల ఆయన జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 10లోని సన్‌బర్న్ పబ్‌లో నిర్వహించిన వేడుకకు హాజరయ్యారు. కార్యక్రమానికి సిద్ శ్రీరాం వస్తుండటంతో నిర్వాహకులు టిక్కెట్లు అడ్డగోలుగా అమ్మేశారు. కేవలం 500 మంది లోపు సరిపోయే ఈ ప్రాంగణంలో వందలాది మంది వచ్చారు. సిద్ శ్రీరాం ఒకవైపు తన బ్యాండ్‌తో కలిసి పాటలు పాడుతుండగా పై నుంచి కొందరు ఆకతాయిలు మద్యంతోపాటు నీళ్లు చల్లారు. ఆయా బృంద సభ్యులపై అవి పడటంతో కార్యక్రమం మధ్యలోనే నిలిపారు.
ఇలాంటి వాటికి తగ్గేదిలేదంటూ తన పాటలను కొనసాగించారు. ''మనసును అదుపులో పెట్టుకొంటే పనిచేసే ప్రాంతంలో భయం ఉండదంటూ'' ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని తెలిపారు. ఈ సంఘటన జరిగిన సమయంలో పబ్ నిర్వాహకులు కలుగజేసుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. అయితే ఆ సమయంలో పబ్ లో పలువురు సెలబ్రెటీలు వున్నందున పోలీసు కేసు లేకుండా చేసినట్లు నిర్వాహకులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.