Breaking News: ప్రముఖ నటుడు కృష్ణంరాజు కన్నుమూత
Breaking News: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు
Breaking News: మరో సినీ తార నేలరాలింది. తెలుగు లెజెండ్ , రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. తెల్లవారుజామున 3.25 గంటలకు కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజుకు భార్య శ్యామలాదేవి, ముగ్గురు కుమార్తెలున్నారు. కృష్ణంరాజు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ కుమారుడు ప్రభాస్. కృష్ణంరాజు మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సంతాపం తెలుపుతున్నారు. కృష్ణంరాజుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
కృష్ణంరాజు 1940 జనవరి 20న జన్మించారు. కృష్ణరాజు 187 సినిమాలలో నటించాడు. కృష‌్ణంరాజు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. 1966లో చిలకా గోరింక చిత్రంతో తెలుగు సినీ రంగప్రవేశం చేశారు. అవేకళ్లు చిత్రంలో విలన్‌గా కృష్ణంరాజు నటించారు. కృష్ణంరాజు నటించిన ఆఖరి చిత్రం రాధేశ్యామ్.
1991లో కృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీ తరఫున 12 వ లోక్‌సభ ఎన్నికలలో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.. ఆ తరువాత 13 వ లోక్‌సభకు కూడా నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎన్నికై వాజపేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.
మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరారు.. తరువాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. కృష్ణంరాజు మొదట కాంగ్రెస్ పార్టీలో 1991లో చేరారు. అదే ఏడాది నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత కొద్దికాలం రాజకీయాలకు దూరమై సినిమాలకు పరిమితమయ్యారు.
1998 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టాడు. 1999 మధ్యంతర ఎన్నికలలో నర్సాపురం లోక్‌సభ నుండి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొంది కేంద్రంలో వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఏ. ప్రభుత్వంలో మంత్రి పదవిని నిర్వహించారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో మళ్ళీ అదే స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జోగయ్య చేతిలో పరాజయం పొందారు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు.
అమరదీపం, ధర్మాత్ముడు, బొబ్బిలి బ్రహ్మన్న...తాండ్ర పాపారాయుడు సినిమాలకు కృష్ణంరాజు ఫిల్మ్ ఫేర్ అవార్డులు పొందారు. 1977, 1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారం పొందారు. 2014లో కృష్ణంరాజుకు రఘుపతి వెంకయ్య అవార్డు వరించింది. గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పై కృష్ణంరాజు పలు చిత్రాల నిర్మించారు.