Pawan Kalyan: బీఏ రాజుకు జనసేనాని నివాళి
Pawan Kalyan: ప్రముఖ నిర్మాత, సీనియర్ జర్నలిస్టు, పీఆర్వో బీఏ రాజు కన్నుమూశారు.
Pawan Kalyan: ప్రముఖ నిర్మాత, సీనియర్ జర్నలిస్టు, పీఆర్వో బీఏ రాజు కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కొంతకాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా.. శుక్రవారం రాత్రి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. బీఏ రాజు మరణించడం పట్ల టాలీవుడ్ అగ్రకథానాయకుడు, జనసేన అధ్యక్షుడు పవన్ స్పందించారు.
బీఏ రాజు హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. బీఏ రాజు జర్నలిస్టుగా, పీఆర్వోగా తెలుగు సినీరంగంలో చిరపరిచితులైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. బీఎ రాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పవన్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. బీఏ రాజుతో చెన్నైలో ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఆయన సినిమా అంటే ఎంతో తపన కలిగిన జర్నలిస్టు. మా అన్నయ్య చిరంజీవి నటించిన పలు చిత్రాలకు పీఆర్వోగా వ్యవహరించారు. 'సూపర్ హిట్' సినీ పత్రిక సంపాదకులుగానే కాకుండా నిర్మాతగానూ రాణించారు" అంటూ పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
జర్నలిస్టుగా కేరీర్‌ను ప్రారంభించిన బీఏ రాజు.. చాలా మంది అగ్ర నటులకు పీఆర్‌ఓగా వ్యవహరించారు. దీంతోపాటు ఆయన పలు సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, లవ్లీ, సవాల్, వైశాఖం వంటి చిత్రాలను నిర్మించారు. సూపర్ హిట్ మ్యాగజైన్‌కు సంపాదకుడిగా, నిర్వాహకుడిగా వ్యవహరించారు. కాగా.. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.