Celebrities About Pawan Kalyan: పవన్ కల్యాణ్ అసలు హీరో ఎలా అయ్యారంటే.. నిజంగా జరిగిన రియల్ ఇన్సిడెంట్
Celebrities About Pawan Kalyan: పవన్ కల్యాణ్ అంటే ఆయన అభిమానులకు కొండంత అభిమానం అనే మాట కూడా చాలా చిన్నదే అవుతుంది. ఎందుకంటే పవన్ కల్యాణ్‌పై వారికి ఉన్న అభిమానాన్ని కొలిచే సాధనం ఏదీ ఇంకా రాలేదు. పవర్ స్టార్ అంటే ఎందుకంత పిచ్చి అంటే ఎవ్వరి దగ్గరా సరైన సమాధానం ఉండదు. ఎందుకంటే ఆ పిచ్చి మాటల్లో చెప్పలేనిది. కానీ పవన్ కల్యాణ్‌ని అతి దగ్గరిగా చూసిన వాళ్లకు మాత్రం ఆయన వ్యక్తిత్వం గురించి ఒక క్లారిటీ ఉంది. ఆయన మనస్తత్వం గురించి వారి మనసుల్లో మాటల్లో చెప్పలేనంత అభిప్రాయం ఉంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు మాటలన్నీ కూడదీసుకుని వాళ్లు పవన్ కల్యాణ్ గురించి చెప్పిన మాటలు వింటుంటే.. ఔరా ఇందుకు కదా పవన్ అంటే ఇంత అభిమానం అని అనిపించకమానదు. నేడు పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. వివిధ సందర్భాల్లో పవన్ కల్యాణ్ గురించి ఎవరెవరు ఏమేం అన్నారో తెలుసుకుందాం రండి.
పవన్ కల్యాణ్ గురించి వివిధ సందర్భాల్లో సెలబ్రిటీలు చెప్పిన మనసులో మాట
పవన్ కల్యాణ్ కోసం ప్రత్యేకంగా కథ అక్కర్లేదు. నాలుగు పాటలు, విలన్లను ఎగురగొట్టే సీన్స్, జనానికి మంచి చేసే సీన్స్ ఉంటే చాలు. ఎందుకంటే పవన్ సినిమాలకు జనం కథ కోసం రారు. ఆయన్ని చూడ్డానికే వస్తారు. డైనమైట్‌కి అగ్గి పెట్టేందుకు అగ్గిపుల్ల చాలు. పవన్ కల్యాణ్ కూడా ఒక డైనమైట్. ఆయనకు ఇంకేమీ అక్కర్లేదు. అలీతో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రముఖ కథ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలివి.
పవన్ కల్యాణ్‌ని జనం ఎందుకు లైక్ చేస్తారో తెలియదు..
పవన్ కల్యాణ్ ఒక అసాధారణమైన వ్యక్తి. అతన్ని ఎందుకు లైక్ చేస్తారో తెలియదు. ఎందుకంటే ఆ కేపాసిటీ, స్టేచర్ ఆయనలో ఉంది. పవన్ కల్యాణ్ అంటే ఆల్రెడీ ఒక పవర్ హౌజ్. పవన్ అంటేనే పవర్‌కి ప్రాతినిధ్యం వహించినట్లుగా ఉంటారు. బద్రీ మూవీ కోసం పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేసిన రోజులను గుర్తుచేసుకుంటూ ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చెప్పిన మాటలివి.
మీకు పవర్ స్టార్... కానీ నాకు మాత్రం దేవుడు...
మీకు పవన్ కల్యాణ్ పవర్ స్టార్... కానీ నాకు పవన్ కల్యాణ్ దేవుడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఒక సినిమా ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి అన్న మాటలివి. పూరి ఫస్ట్ టైమ్ డైరెక్టర్‌గా వచ్చిన బద్రి మూవీ పవన్ కళ్యాణ్‌ని ఏ రేంజ్లో ఎలివెట్ చేసిందో తెలిసిందే. " నువు నంద అయితే నేను బద్రి.. బద్రీనాథ్ " అంటూ పవర్ స్టార్ చెప్పిన డైలాగ్ డైనమైట్‌లా పేలింది. ఇప్పటికీ పవర్ స్టార్ చెప్పిన ఆ డైలాగ్ విన్న ప్రతీసారీ పేలుతున్నట్లుగా ఉంటుంది.
తొలిప్రేమ మూవీకి పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ తీసుకోలేదా?
టాక్ షోకి వచ్చి మాట్లాడకుండా కంఫర్ట్‌గా కూర్చోవడం చూస్తోంటే నాకే కుళ్ళుగా ఉంది. నా షోలో మాట్లాడకుండా అంత కంఫర్ట్ ఎంజాయ్ చేస్తున్న ఫస్ట్ గెస్ట్ నువ్వే. బాలయ్య బాబు హోస్ట్‌గా వ్యవహరించిన ఒక టాక్ షోలో తనే పవన్ కల్యాణ్‌తో అన్న మాటలివి. అదే సందర్భంలో ఒక ఆసక్తికరమైన అంశం వాళ్లిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చింది. అదేంటంటే.. తొలిప్రేమ సినిమాకు అసలు రెమ్యునరేషన్ తీసుకోలేదట కదా అని బాలకృష్ణ అడిగారు. అందుకు పవన్ కల్యాణ్ స్పందిస్తూ తాను పారితోషికం తీసుకున్నట్లు చెప్పారు. కాకపోతే 100 డేస్ ఫంక్షన్ అయ్యాకే తీసుకున్నట్లు పవన్ వెల్లడించారు.
కోట్లలో ఒకడు.. మర్రి చెట్టు లాంటోడు..
ఒకరు చెయ్యేత్తితే జనం ఆగేంత శక్తి ఆ దేవుడు కోట్లలో ఎవరో ఒకరికి ఇస్తాడు. ఇటువైపు వెళ్ళండి అని చెయ్యి చూపిస్తే అక్కడ ఏం ఉందని కూడా ఆలోచించకుండా పరుగెత్తుకుని వెళ్ళే ప్రేమ , శక్తి ఎక్కడో కోట్లలో ఒకరికి ఇస్తాడు. అలాంటి కోట్లలో ఒకడు మన పవర్ స్టార్. ఊరి చివర మర్రి చెట్టు లాంటి వాడు పవన్ కల్యాణ్. మర్రిచెట్టు తన దగ్గరికి వచ్చే వాళ్ళ కోసం ఎండాకాలం నీడనిస్తుంది. వానాకాలం తడవకుండా కాపాడుతుంది. కానీ ఏనాడు నాకు గుర్తింపు కావాలని కోరుకోదు. అలా మౌనంగా, ఊరి చివరన దూరంగా ఉంటుంది. పవన్ కల్యాణ్ కూడా తన దగ్గరికి వచ్చే ఎంతోమందికి సాయం చేయడం నా కళ్ళారా చూసాను. కానీ ఏనాడు చెప్పుకోడు. ఒక మనిషి కూసింతయినా పుణ్యం చేయకపోతే శివుడు పిలవడు అని సీతారామా శాస్త్రి చెబుతుంటారు. అలాగే నలుసంతయినా మంచితనం లేకపోతే ఇంతమంది ఎలా ప్రేమిస్తారు.. ఒక సినిమా ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ స్టామినా, వ్యక్తిత్వం గురించి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పిన మాటలివి.
పవన్ కల్యాణ్‌లో నాకు నచ్చే విషయం..
పవన్ కల్యాణ్ రియల్ లైఫ్ హై స్పీడ్ ఇంటెన్సిటీ ఉంటుంది. పవన్ కల్యాణ్ కళ్లు కానీ లేదా బాడీ లాంగ్వేజ్ కానీ ఒక కింగ్ కోబ్రాలా ఉంటాడు. అది నాకు ఇష్టం.. ఒక సందర్భంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి రాంగోపాల్ వర్మ తన మనసులో మాటగా చెప్పిన అభిప్రాయం ఇది.
రజినీకాంత్, పవన్ కల్యాణ్‌లో నచ్చిన విషయం అదే..
పవన్ కల్యాణ్, రజినీకాంత్ ఇద్దరిలో నాకు బాగా నచ్చిన అంశాలు ఇద్దరూ కూడా చాలా సింప్లిసిటీతో ఉంటారు. ఇద్దిరికీ సాయం చేసే గుణం ఉంది. ఒకరికి సాయం చేసే గుణం ఉన్న వాళ్లు ఎవరైనా నా దృష్టిలో మంచివాళ్లే. అందుకే ఆ ఇద్దరిని నేను అభిమానిస్తాను. ఆ ఇద్దరితో నాకు మంచి పరిచయం ఉంది. నారాయణ మూర్తి ఒక సందర్భంలో పవన్ గురించి పంచుకున్న మనసులో మాట ఇది.
జనం కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతో
పవన్ కల్యాణ్ కెరీర్లో పీక్ స్టేజ్‌లో ఉన్నాడు. ఆయన సినిమాల కోసం జనం ఎదురుచూస్తున్న రోజులు ఇవి. హీరోగా ఇంత క్రేజ్ ఉండి కూడా జనం కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వెళ్లారు - బ్రహ్మాజీ
హీరోని అని అభిప్రాయం మార్చుకోలేను
నేను హీరో కానప్పుడు పవన్ కల్యాణ్‌ని అభిమానించాను. అయ్యాకా అదే ఫీలింగ్. రేపు సినిమాల్లోంచి వెళ్లిపోయినా అదే అభిమానం ఉంటుంది. నేను ఏంటనే సంగతి పక్కనపెడితే ఇది మనిషిగా నాకున్న అభిప్రాయం. పవన్ కల్యాణ్ షేక్‌హ్యాండ్ ఇచ్చినా అక్కడి నుండి ఒక పవర్ పాస్ అవుతుంది. పవన్ కల్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్, యాక్టర్ నితిన్ మనసులో మాట.
నేనయినా సరే తప్పు చేస్తే ప్రశ్నించాల్సిందే..
నాతో సహా ఎవరైనా సరే తప్పు చేస్తే ప్రశ్నించండి. తప్పు ఎవరు చేసినా ప్రశ్నించాల్సిందే. దానికి శిక్ష పడాల్సిందే. పవన్ కల్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పిన ఆ మాట బ్రహ్మాండం. నాయకులకు ఆ నిజాయితీ కూడా ఉండాలి కదా.. - తమ్మారెడ్డి భరద్వాజ.
అంత ఈజీ కాదు.
అన్న చిరంజీవి మెగాస్టార్ అయ్యుండి కూడా పవన్ కల్యాణ్ ఆ షాడోలోంచి బయటికొచ్చి సొంతంగా ఒక స్టైల్, ఇమేజ్, పాపులారిటీ సొంతం చేసుకోవడం అంత ఈజీ కాదు. టాలీవుడ్‌లో అది పవన్ కల్యాణ్‌కే సాధ్యపడింది. సర్దార్ సినిమా ఫంక్షన్‌లో అక్కినేని నాగార్జున
పవన్ కల్యాణ్‌కి 10 మార్కులు వేయొచ్చు
పవన్ కల్యాణ్ ఒక మంచి మనిషి. పవన్ కల్యాణ్ ఏం చేసినా గుడ్డిగా పదికి 10 మార్కులు వేయొచ్చు -సమంత
నాకు ఎవరిని చూసినా స్టార్‌ని చూసిన ఫీల్ కలగదు..
నాకు ఎవరిని చూసినా స్టార్‌ని చూసిన ఫీల్ కలగదు. కానీ కల్యాణ్ బాబుని చూస్తే మాత్రం రియల్ స్టార్‌ని చూసినట్లు అనిపిస్తుంది. డాన్సులేసినంత మాత్రాన, ఫైట్లు చేసినంత మాత్రాన లేదా పెద్దపెద్ద డైలాగ్స్ చెప్పినంత మాత్రాన స్టార్ అయిపోరు. స్టార్ అనేది లోపల ఉంటుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక సినిమా వేదికపై పవర్ స్టార్ గురించి చెప్పిన మనసులో మాట ఇది.
ఇలాంటి వాడు ఇంకొకడు ఉంటాడా
పవన్ కల్యాణ్ ముక్కుసూటి మనిషి.. నిజాయితీగా ఉంటాడు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లడు. ఒకదాన్ని పంటుకున్నాడంటే దాని అంతు చూసే వరకు ఊరుకోడు. పవన్‌ని దగ్గరిగా చూస్తుంటే ఇలాంటి వాడు ఇంకొకడు ఉంటాడా అనిపిస్తుంది. తమ్ముడు పవన్ కల్యాణ్ గురించి మెగా బ్రదర్ నాగబాబు పంచుకున్న అభిప్రాయం ఇది.
పవన్ కల్యాణ్ హీరో ఎలా అయ్యారంటే..
అప్పటికి ఇంకా పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రాలేదు. ఏం చేయాలి, ఎటు వైపు వెళ్ళాలి అని క్లారిటీ లేనప్పుడు ఒకరోజు నేనూ, వాళ్ళ వదిన సురేఖ ఒక దగ్గర కూర్చున్నప్పుడు మా దగ్గరికి వచ్చి అడిగాడు. నేనేం చేయాలి, ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలి అని. అప్పుడు మేం చెప్పింది ఒక్కటే.. నీకు ఏం చేయాలి అని ఉంటే అది చెయ్. కానీ నీకు సినిమా అయితే బాగా సూట్ అవుతుంది అని చెప్పాం. అలా పవర్ స్టార్ మన ముందుకు వచ్చాడు. ఒక సినిమా ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన మాటల్లో చెప్పిన ఆసక్తికరమైన రియల్ ఇన్సిడెంట్ ఇది. చిరంజీవి, సురేఖ ఎదుట జరిగిన ఈ సీన్ కట్ చేస్తే... నేడు పవన్ కల్యాణ్ ఒక బిగ్ పవర్ స్టార్.. కాదు కాదు.. పవర్ హౌజ్. అంతేకాదు.. ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ కూడా అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కి మరోసారి హ్యాపీ బర్త్‌డే...