NTR's Birth Anniversary: తెలుగింట అవతార పురుషుడు.. రాజకీయాల్లో యుగపురుషుడు ఎన్టీఆర్
NTR’s Birth Anniversary: మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మే 28 1923న జన్మించారు.
NTR's Birth Anniversary: తెలుగు లోగిళ్ల దేవుడు.. వెండితెర అవతార పురుషుడు.. తెలుగు తమ్ముళ్లకు యుగపురుషుడు.. అందరితో అన్న అని పిలిపించుకున్న ఆ తారకరాముడి జన్మదినం నేడు. ఆ కళ్లు వెన్నెల కురిపించాయి.. ఆ కళ్లు రౌద్రాన్ని ప్రదర్శించాయి.. ఆ కళ్లు నిప్పులు రగిలించాయ్.. ఆ కళ్లు కన్నీటిని ధారపోసాయ్..పెద్ద పెద్ద కళ్లు, కోటేరులాంటి ముక్కు.. అందమైన నవ్వులు పూయించే మోముతో... మన ఎన్టీవోడు ఎంత అందంగా ఉండేవాడో నాటి, నిన్నటి, నేటి తరాలందరికీ తెలుసు. కృష్ణాజిల్లా నిమ్మకూరులో నందమూరి కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్.. తొలి నుంచి నటనపై ఆసక్తి ప్రదర్శిస్తూ.. ధైర్యంతో, తెగించి వెండితెరపై వెలుగులు విరజిమ్మాలని మద్రాసుకు దూసుకుపోయాడు.
వెండితెరపై ఆయన రూపం.. ప్రతి ఒక్కరి మనసుపై ముద్ర వేసేసుకుంది. అందమైన నవ్వు.. చక్కటి కంఠం..అన్నిటిని మించి మగధీరుడులాంటి కటౌట్... ఇన్ని ఉండగా.. వెనుదిరిగి చూసే అవకాశం ఎందుకుంటుంది? వెండితెర వేలుపుగా నిలిచిపోయాడు. జానపదం, పౌరాణికం, సాంఘికం ఒకటేమిటి అన్ని రకాల పాత్రల్లోనూ మెప్పించడమే కాదు.. జీవించాడు. నేటికి కృష్ణుడంటే మాయాబజార్ లోని రామారావే అందరికీ గుర్తొస్తాడు. అర్జునుడంటే నర్తనశాలలో మెలేసిన మీసాలతో గాండీవం పట్టుకున్న రామారావే కనిపిస్తాడు. దుర్యోధనుడు అంటే దానవీరశూరకర్ణలో రాజసం ప్రదర్శించిన ఎన్టీఆరే దర్శనమిస్తాడు. ఇప్పటికీ ఆ సినిమాలో సింహాసనంపై కూర్చున్న స్టిల్.. ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని ఇంట్లో దర్శనమిస్తుంది.. అసలు ఆ ఫోటో చూస్తేనే చాలు అభిమానులు మైమరిచిపోతారు.
సినిమాల్లో ఉండగానే.. వరదల సమయంలో ప్రజల కష్టాలు చూసి చలించి సాయం అందించడమే కాక.. పరిశ్రమనే కదిలించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలను చూసి.. ప్రజల బాధలను చూసి.. కొందరు రాజకీయ నాయకుల సూచనలతో.. రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సినీప్రస్థానంలో చూపించిన క్రమశిక్షణనే రాజకీయంలోనూ చూపించారు. ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశమే ఓ చరిత్ర అన్నట్లుగా సాగింది. కాంగ్రెస్ వ్యతిరేకత విపరీతంగా పెరిగిన ఆ సమయంలో ఎన్టీఆర్ ఆపద్భాంధవుడిగా కనిపించాడు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఎన్నికల్లో ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించాడు.
ఎన్టీఆర్ ముక్కుసూటితనం, మొండితనం పార్టీలోనే శత్రువులను తయారయ్యేలా చేశాయి. తమ మాటపై రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు మాట విననంటే ఎలా అంటూ నాదెండ్ల భాస్కరరావు వంటివాళ్లు తిరుగుబాటు చేసి.. అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్, అధినేత్రి ఇందిరాగాంధీ సహకారంతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడేశారు. ఇక్కడ మళ్లీ మరో కొత్త చరిత్ర లిఖించబడింది. పడిపోయిన ప్రభుత్వం నిలబెట్టుకునేదాకా అలుపెరగని పోరాటం చేసిన ఎన్టీఆర్ కు ప్రజలు మద్దతుగా నిలబడ్డారు. పలితంగా నాదెండ్ల రాజీనామా చేశారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లి... ఈసారి నమ్మకస్తులనే ఎమ్మెల్యేలుగా పెట్టుకుని విజయం సాధించారు ఎన్టీఆర్.
ఉద్యోగుల ఉదాసీనతపై కఠినంగా వ్యవహరించడం, కుల ప్రభావం వంటివాటితో వ్యతిరేకత పెరిగి.. 1989లో ఓడిపోయారు. అంతటి ఇమేజ్ ఉన్న మనిషి ఓటమి ఎదురైతే నీరసంతో పక్కకు వెళ్లిపోతారు. కాని అలా చేస్తే ఎన్టీఆర్ ఎలా అవుతారు. రెట్టించిన ఉత్సాహంతో 1994లో మళ్లీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. అయితే లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి అర్ధాంగిగా ప్రవేశించడం.. దానిని కుటుంబసభ్యులు వ్యతిరేకించడం వంటివాటితో పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. లక్ష్మీపార్వతిపై వ్యతిరేకత ఉన్నవారిని చంద్రబాబు ఒక చోటకు చేర్చి.. ఎన్టీఆర్ పైనే తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు.
ఈ పరిణామాలతో కుంగిపోయిన.. ఎన్టీఆర్.. ఆ తర్వాత కొన్నాళ్లకే చనిపోయారు. ప్రజల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వ పాలనను కొనసాగించిన ఎన్టీఆర్ పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అనుకున్నదానిని అమలు చేసేందుకు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గని నాయకుడిగా నిలబడ్డారు. అవినీతికి తావివ్వని, సహించని ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగుజాతికి మరపురాని, మరువలేని తీపిగురుతుగా నందమూరి తారకరామారావు చిరస్థాయిగా నిలిచిపోయారు.