Mumbai Drugs Case: ఆర్యన్‌ఖాన్ ఫోన్‌లో పలు సంచలన విషయాలు
* ఆర్యన్ ఫోన్ ద్వారా డ్రగ్స్ పెడ్లర్స్‌తో ఛాటింగ్ చేసినట్లు గుర్తింపు * షూటింగ్ రద్దు చేసుకున్న షారూక్‌ఖాన్
Mumbai Drugs Case: సంచలనంగా మారిన ముంబై షిప్ రేవ్ పార్టీలో ప్రముఖుల పిల్లలను ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అందులో బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్‌తో సహా ఎనిమిది మందిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. పక్కా సమాచారంతో ఎన్సీబీ అధికారులు ముంబై తీరంలో క్రూజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీ పైన దాడి చేసారు.
అయితే తాను ఓ గెస్ట్‌గా మాత్రమే అక్కడికి వెళ్లినట్లు విచారణలో ఆర్యన్ చెప్పినట్లు తెలుస్తోంది. నిన్న ఉదయం నుంచి ఆర్యన్ ఖాన్ ను ప్రశ్నించిన ఎన్సీబీ.. సాయంత్రం అరెస్ట్ చేసింది. అతనితో పాటు స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా, నుపుర్ సారికా, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రాలను కూడా అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ తెలిపింది.
క్రూజ్ షిప్‌లో నిషేధిత డ్రగ్స్ లభించినట్లు ఎన్సీబీ వెల్లడించింది. మొత్తం ఐదు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. అర్యన్ పట్టుబడిన సమయంలో డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్యన్‌ఖాన్ ఫోన్‌లో పలు సంచలన విషయాలను ఎన్సీబీ అధికారులు గుర్తించినట్లుగా సమాచారం.
దీంతో ఆర్యన్‌ఖాన్ సెల్‌ఫోన్‌ను అధికారులు సీజ్ చేశారు. ఆర్యన్ తన ఫోన్ ద్వారా డ్రగ్స్ పెడ్లర్స్‌తో ఛాటింగ్ చేసినట్లు తేల్చారు. వారితో ఉన్న సంబంధాలు..పేమెంట్స్.. ఇతరత్ర విషయాలపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. కేసులో పట్టుబడ్డ మరో నలుగురిని నేడు కోర్టులో హాజరుపర్చనున్నారు అధికారులు. ఆర్యన్‌ఖాన్ అరెస్ట్‌తో షారూక్‌ఖాన్ షూటింగ్‌లన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.