నందమూరి తారక రాముడు.. ప్రజల గుండెల్లో నిలిచిన దేవుడు.
చాలామంది తెలుగు వారి మస్సుల్లో "రాముడు, కృష్ణుడు" అనగానే మొదట మెదిలే రూపం..ఆయన రూపమే. ప్రజల ఆకలి తీర్చడం కోసం "రెండు రూపాయలకు కిలో బియ్యం" అనగానే గుర్తుకి వచ్చేది, ఆయన మనసున్న నాయకత్వమే. అలాగే తను నమ్మిన సిద్దాంతాల కోసం, విలువలకోసం తన కుటుంబాన్ని మొత్తం దూరం చేసుకోవలసివచ్చిన, మొండిగా నిలబడిన మొనగాడు అనగానే గుర్తుకు వచ్చేది ఆయన వ్యక్తిత్వమే. ఆయనే…మన తెలుగువారు "అన్నగారు" అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు. ఈ రోజు ఆ మహా నటుడి, మహా నాయకుడి, మహా పురుషుడి పుట్టినరోజు. తను మే 28, 1923 ఈ జగమనే నాటకరంగంలో అడుగుపెట్టి, తన పాత్రను అద్బుతంగా పోషించి..జనవరి 18, 1996 నాడు నిష్క్రమించాడు. మన ఎన్టీఆర్ ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావుగా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు.
తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన, అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి ... యమగోల చేసి, బొబ్బిలి పులిలా గాండ్రించి, జస్టిస్ చౌదరి లా మెప్పించాడు. ఇలా తను జీవించిన పాత్రలతో, ముఖ్యంగా రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు.
తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు 44 పౌరాణిక చిత్రాలు చేసారు. ఆ తర్వాత కొన్ని ప్రత్యెక పరిస్థితుల్లో...రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసాడు, పచ్చ జెండాతో తెలుగు రాష్టాలకి కొత్త ఉత్సాహం, ఆత్మగౌరవం నింపాడు. తను పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లోకాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్న మహా నేత. ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు. ఇలా నందమూరి తారక రామారావు అంటే...గల్లి నుండి డిల్లి వరకు వినిపించే పేరుల నిలుపుకున్నాడు. తెలుగువారి చరిత్రలో తనకంటూ ఎన్నో పేజీలు నిలుపుకున్న మహా వ్యక్తి.. మన ఎన్టీఆర్.