Nayanthara: అది నన్ను షాక్‌కు గురిచేసింది.. ధనుష్‌పై నయన్ విమర్శలు..
Nayanthara Dhanush: నటి నయనతార జీవితం ఆధారంగా ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ తెరకెక్కిన విషయం తెలిసిందే.
Nayanthara Dhanush: నటి నయనతార జీవితం ఆధారంగా ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ప్లిక్స్ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించింది. నయనతార కెరీర్ మొదలు వివాహం వరకు అంశాలను ఇందులో చూపించనున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’ పాటలు వినియోగించుకోవడానికి ఆ సినిమా నిర్మాత ధనుష్ అవకాశం ఇవ్వలేదు. ఇందుకుగాను ధనుష్ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో ఈ వ్యవహారంపై నయనతార ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేసింది.
మూడు పేజీల నిడివి ఉన్న సుదీర్ఘ నోటీసును ఇన్‌స్టావేదికగా పంచుకున్నారు. ఇందులో ఆమె పలు విషయాలను ప్రస్తావించారు. తండ్రి, దర్శకుడైన సోదరుడి సపోర్ట్‌తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడైన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అంటూ రాసుకొచ్చారు. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి తాను ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుందని నయన్ తెలిపారు.
తన జీవితం ఆధారం చేసుకొని రూపొందిన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం తాను మాత్రమే కాకుండా సినీప్రియులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారన్నారు. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ డాక్యుమెంటరీని రూపొందించామని తెలిపిన నయనతార.. మీరు మాపై పెంచుకున్న ప్రతీకారం మమ్మల్ని మాత్రమే కాకుండా ఇందులోభాగమైన ఇతర సభ్యులను కూడా ఎంతగానో ఇబ్బందిపెడుతోందని ధనుష్‌కు చురకలు అంటించింది. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన ‘నానుమ్ రౌడీ దాన్’ డాక్యుమెంటరీలో భాగం కాకపోవడం చాలా బాధాకరమన్నారు.
'నానుమ్ రౌడీ దాన్' సినిమాలోని సన్నివేశాలను ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం తన హృదయాన్ని ముక్కలు చేసిందని నయనతార అన్నారు. వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్లగక్కడం కోసం మీరు ఇంతకాలం ఆగి ఆమోదం ఇవ్వకపోవడం బాధాకరమంటూ మండి పడింది. డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే పంపించిన లీగల్ నోటీస్ షాక్‌కు గురి చేసిందని నయనతార రాసుకొచ్చింది. అందులో మూడు సెకన్ల క్లిప్స్ వాడుకున్నందుకు దాదాపు రూ.10 కోట్లు డిమాండ్ చేయడం విచారకరమంది.
సినిమా విడుదలై 10 ఏళ్లు దాటుతోన్నా ఒక మనిషి ప్రపంచం ఎదుట ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తారంటూ నయన్ ప్రశ్నించింది. ఈ లేఖతో నేను ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నా. తెలిసిన వారు విజయాలు అందుకుంటే అసూయ పడకుండా దానిని కూడా సంతోషంగా తీసుకోండి అంటూ రాసుకొచ్చింది. ఇతరుల స్టోరీల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ మా కథను డాక్యుమెంటరీగా రూపొందించాం. మీరు కూడా దీనిని చూడండి. అలా అయినా మీ మనసు మారొచ్చు. ప్రేమను పంచండి. మాటల్లోనే కాకుండా చేతల్లోనూ మీరు దీనిని చూపించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ నయనతార సుదీర్ఘంగా రాసుకొచ్చారు. మరి నయన్ చేసిన పోస్ట్‌పై ధనుష్ స్పందిస్తారో లేదో చూడాలి.