Actress Kasturi Arrest: హైదరాబాద్‌లో సినీ నటి కసూర్తి అరెస్ట్
సినీ నటి కస్తూరిని హైద్రాబాద్ లో చెన్నై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై కేసు నమోదైంది.
Actress Kasturi Arrest: సినీ నటి కస్తూరిని హైదరాబాద్‌లో చెన్నై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కస్తూరిపై ఆలిండియా తెలుగు ఫెడరేషన్ అధ్యక్షులు సీఎంకె రెడ్డి ఈ నెల 5న చెన్నై ఎగ్మోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆమెపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చెన్నైతో పాటు మధురై, తేని జిల్లాల్లో కూడా ఆమెపై కేసులు నమోదయ్యాయి.
ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఎగ్మోర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన తర్వాతి నుండి పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అప్పటి నుండి ఆమె ఆచూకీ లభించలేదు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని పోలీసులు ప్రకటించారు. అదే సమయంలో ఆమె మద్రాస్ హైకోర్టు మధురై బెంచీలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కస్తూరికి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేస్తూ నవంబర్ 14న తీర్పు వెల్లడించింది.
అసలు ఆమె ఏం అన్నారంటే?
ఓ రాజు అంత:పురంలో పనిచేసే మహిళలకు సేవ చేసేందుకు వచ్చినవారే తెలుగువారని ఆమె అన్నారు. చెన్నైలో నవంబర్ 3న నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. దీంతో ఆమె వివరణ ఇచ్చారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. తన వ్యాఖ్యలను డీఎంకే నాయకులు వక్రీకరించారని ఆమె ఆరోపించారు. తెలుగు ప్రజలను కించపర్చడం తన ఉద్దేశ్యం కాదని కూడా ఆమె చెప్పారు.