MAA: "మా" సమస్యలపై ఇవాళ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు కృష్ణంరాజు చర్చ
* ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు రాసిన లేఖలపైనే ప్రధాన చర్చ * కీలక నిర్ణయాలు తీసుకోనున్న క్రమశిక్షణ సంఘం
MAA: ఇవాళ "మా" ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరగనుంది. క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు కృష్ణంరాజు ఆధ్వర్యంలో వర్చువల్‌గా మీటింగ్ నిర్వహించనున్నారు. "మా" ఎన్నికల నిర్వహణ, జనరల్ బాడీ మీటింగ్ తేదీ ఖరారు, "మా" సమస్యలపై చర్చించనున్నారు. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు రాసిన లేఖలపైనే ప్రధానంగా చర్చ జరగనుండగా కీలక నిర్ణయాలు తీసుకోనుంది క్రమశిక్షణ సంఘం.వీలున్నంత తొందరగా ఎన్నికలు జరపాలని మెజారిటీ ఈసీ సభ్యులు క్రమశిక్షణ సంఘానికి లేఖలు రాయడంతో "మా" ఎన్నికలు మరో మలుపు తిరిగాయి. మరోవైపు లేఖలు రాయడంపై ప్రత్యర్థులు మండిపడుతున్నారు. కరోనా సమయంలో ఎన్నికలేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది మార్చితో ఎగ్జిక్యూటివ్ కమిటీ రెండేళ్ళ పదవీ కాలం ముగిసినా కరోనా కారణంగా ఇంకా ఎన్నికలు నిర్వహించలేదు. అయితే గత రెండు నెలలుగా మా అసోసియేషన్‌లో ఎన్నికల హడావుడి జోరుగా సాగుతోంది.
"మా" ఎన్నికల బరిలో ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు, సీఎల్ నరసింహారావు, జీవిత రాజశేఖర్‌తో పాటు హేమ బరిలో నిలిచారు. ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికలు ఏకగ్రీవమైతే పోటీ నుంచి తప్పుకుంటానని ఇప్పటికే మంచు విష్ణు వెల్లడించారు. ఇంకోపక్క సెప్టెంబర్ వరకూ టైమ్ ఉండగా ఎన్నికలకు ఇప్పుడే ఈ తొందరేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి "మా" ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పబ్లిక్ రాజకీయాలకు ఏమాత్రం తీసిపోకుండా సినీ రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.