MAA Elections 2021: "మా" ఎన్నికల పోలింగ్ ప్రారంభం, ఒక్కో ఓటరు 26 ఓట్లు...
MAA Elections 2021: ఉ.8 గంటల నుంచి మ.2 గంటల వరకు పోలింగ్...
MAA Elections 2021: 'మా' ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక "మా" అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌లకు ఓటు వేసేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు కూడా సిద్ధమయ్యారు. కాగా.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే ఈ సారి ఎన్నడూ లేని విధంగా 'మా' ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. దీంతో 'మా' అధ్యక్షుడిగా ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది.
'మా' కార్యవర్గాన్ని రెండేళ్లకొకసారి ఎన్నుకుంటారు. ఇందులో అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఇద్దరు జాయింట్ సెక్రటరీలతోపాటు ట్రెజరర్, 18 మంది ఈసీ మెంబర్లతో కలిపి మొత్తం 26 మందితో అసోసియేషన్ తన కార్యకలాపాలను కొనసాగిస్తుంటుంది. అయితే వీరందరిని ఎన్నుకునేందుకు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. "మా' ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఒక్కో ఓటరు 26 ఓట్లు వేయాలి. ఓటింగ్ ప్రక్రియలో ఓటరు తనకు నచ్చిన అభ్యర్థి ఏ ప్యానెల్‌లో ఉన్నాడు, ఏ పదవికి పోటీ చేస్తున్నాడో చూసి ఓటు వేస్తారు. మొత్తం పోలైన ఓట్లలో ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. అధ్యక్షుడైనా, ఈసీ సభ్యుడైనా ఇదే నిబంధన వర్తిస్తుంది. కాగా.. ఎన్నికల్లో రెండు వేర్వేరు ప్యానెల్స్‌లో ఉండి పోటీ చేసిన అభ్యర్థులు గెలిచాక ఒకే ప్యానెల్‌గా మారుతారు. అధ్యక్షుడిగా ఎవరైతే విజేతగా నిలుస్తారో అతని ఆధ్వర్యంలో మిగతా సభ్యులు పనిచేయాల్సి ఉంటుంది.
ఇక 2015లో అసోసియేషన్ ఎన్నికలను ప్రయోగాత్మకంగా ఈవీఎంల ద్వారా నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. ఇక గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలు మరింత ఉత్కంఠగా మారాయి. వాడీవేడీగా చర్చలు, ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రచారం సాగింది. ప్రస్తుతం "మా"లో మొత్తం 925 మంది సభ్యులు ఉన్నారు.