MAA Elections: హీట్ పుట్టిస్తున్న మా అసోసియేషన్ ఎన్నికలు
MAA Elections: వాదోపవాదాలతో దద్ధరిల్లుతున్న మా ఛాంబర్ * మా ఎన్నికలు నిర్వహించాలని రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్
MAA Elections: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ వేడి పుట్టిస్తున్నాయి. మా సభ్యుల వాదోపవాదాలతో మా ఛాంబర్ దద్దరిల్లుతుంది. మా ప్రస్తుత కార్యవర్గం గడువు కాలం సెప్టెంబర్ వరకు ఉన్నప్పటికి మా ఎన్నికలు వెంటనే నిర్వహించాలనే డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ చరిత్రలో ఎన్నడు లేని విధంగా మా అధ్యక్ష పదవికి ఐదుగురు సభ్యులు పోటీ పడుతున్నారు. మా అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ 27 మందితో ప్యానల్‌ను ప్రకటించారు.
ఇక మంచు విష్ణు, నటి జీవితా రాజశేఖర్, హేమ, సి.వి.ఎల్ నరిసింహారావు ఫ్యానల్స్ ప్రకటించకపోయినా... ఎన్నికల బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు. మంచు విష్ణు మా అసోసియేషన్‌కు కు సొంత బిల్డింగ్ నిర్మించే బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇవ్వగా... జీవితా, హేమ మహిళలకు ఈసారి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సి.వి.ఎల్ తెలంగాణ వాదంతో పోటీకి దిగుతున్నారు.
మా ఎన్నికల ప్రస్థావన వచ్చినప్పుడల్లా మా మెంబర్స్ ఒకరి పై ఒకరు దుమ్మెతి పోసుకుంటున్నారు. మా ఎన్నికలు వెంటనే జరపాలని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి.. డీఆర్‌సీ చైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాశారంటేనే అర్ధం చేసుకోవచ్చ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో. అంతేకాకుండా ప్రస్తుత కమిటీ పదవి కాలం ముగిసిందని.. దీని వల్ల సభ్యుల కోసం చేపట్టాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని తెలిపారు. మా ఎన్నికలపై అనేక మంది సభ్యులు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని.. దీని వల్ల సంస్థ ప్రతిష్ఠ మసకబారుతోందని లేఖలో చిరంజీవి అభిప్రాయపడ్డారు.