Kartikadeepam: ఎదురులేని కార్తీకదీపం.. తిరుగులేని వంటలక్క!
Kathika Deepam: టీఆర్పీ రేటింగ్ లలో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్
కింగ్ నాగార్జున బిగ్ బాస్ .. ఐపీఎల్.. డైరెక్ట్ గా వచ్చి పడిపోతున్న కొత్త సినిమాలు.. ఇవేవీ వంటలక్క జోరును అపలేకపోతున్నాయి. అసలు బుల్లితెరపై ఏదీ కూడా కనీసం వంటలక్కకి పోటీ కూడా ఇవ్వలేకపోతోంది. వంటలక్క ఏమిటి? నాగార్జునకు పోటీ ఏమిటీ? అనుకోకండి. అది నిజం. వంటలక్క అంటేనె అందరికీ తెలుస్తుంది. ఎస్.. కార్తీకదీపం సీరియల్ గురించే చెబుతున్నాం.
ఒక సినిమా హిట్టా ఫట్టా తేల్చడానికి డబ్బులు లెక్క తీస్తారు. ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అని. మరి ఒక టీవీ సీరియల్ లెక్క ఏమిటో తెలుసా? టీఆర్పీ రేటింగ్స్. సీరియల్స్ అని కాదు.. టీవీలో ప్రసారం అయ్యే ప్రతి కార్యక్రమానికి సంబంధించి కెపాసిటీ లెక్కలకు ఈ రేటింగ్ లె కొలమానం. ఆయా కార్యక్రమాలకు ప్రజాదరణ ఎంత ఉంది.. ఎంతమంది దానిని చూశారు అనే లెక్కే టీఆర్పీ!
అలాటి లెక్కల్లో ప్రతి వారమూ టాప్ వన్ వంటలక్కే..అనబడే కార్తీకదీపం సీరియల్! ఇప్పుడు ఈ కార్తీకదీపం సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తం జాతీయ స్థాయిలోనే అత్యధిక రేటింగ్స్ సాధించిన సీరియల్‌గా నిలిచింది. ఈ సీరియల్ ను మొత్తం 4.2 కోట్ల మంది చూస్తున్నారట. అందుకే టీఆర్పీ రేటింగ్ 20.7 గా నమోదు అయింది. ఈ రేంజి రేటింగ్ సాధించిన సీరియల్ ఇండియాలో ఇదొక్కటే అని స్టార్ మా చెబుతోంది.
కార్తీకదీపం స్పెషాలిటీ ఇదీ..
ఈ సీరియల్ నిజానికి మలయాళం నుంచి రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో ఈ సీరియల్ పేరు కరుత ముతు. ఆసియానేట్ లో ప్రసారం అవుతుంది. అక్కడ ఇది సూపర్ హిట్ సీరియల్. ఆ సీరియల్ లో హీరోయిన్ గా చేస్తున్న ప్రేమీవిశ్వనాద్ తెలుగులోనూ హీరోయిన్ దీపగా చేస్తోంది. ఇక ఈ సీరియల్ ఇప్పటివరకూ తమిళం, కన్నడం, మరాఠీ భాషల్లో కూడా రీ మెక్ అయి ప్రసారం అవుతోంది. అన్ని భాషల్లోనూ ఈ సీరియల్ సూపర్ హిట్టే. సీరియల్ లో కనిపించేది ముఖ్యంగా ఓ ఆరు క్యారెక్టర్లు. వంటలక్క దీప (ప్రేమీ విశ్వనాద్), కార్తీక్ (పరిటాల నిరుపమ్), కార్తీక్ తల్లి సౌందర్య (అర్చన అనంత్), మౌనిత (శోభాశెట్టి), పిల్లలుగా శౌర్య (కృతిక) హిమ (సహృద). ఈ ఆరు కారెక్టర్ల చుట్టూ తిరిగే ఈ కథలో ప్రతి వారం ఎదో మలుపు ఉంటుంది. ఆ మలుపే ఈ సీరియల్ కు ప్రాణం. ఇక దీప కారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కారెక్టర్ ఇప్పుడు వంటలక్కగా దాదాపుగా ప్రతి తెలుగింటిలోనూ వెలిగిపోతోంది. ప్రేమీ విశ్వనాద్ నటనకు మహిళా ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఇక పిల్లల సెంటిమెంట్ తో సీరియల్ ఊపు ఊపేస్తోంది. అన్నట్టు తెలుగులో ప్రేమీ విశ్వనాద్ అత్యధిక రెమ్యునరేషన్ ఉన్న సీరియల్ నటి.
పెద్ద పెద్ద హీరోల సినిమాలకు కూడా టీవీల్లో ఇంత టీఆర్పీ రేటింగ్ ఎప్పుడూ రాలేదు. ఒకరకంగా ఈ సీరియల్ ఇప్పుడు తెలుగులోనే కాదు జాతీయస్థాయిలో మెగా సీరియల్. ప్రేమీ విశ్వనాద్ మెగా హీరోయిన్.
మొత్తమ్మీద ఒక తెలుగు సీరియల్ జాతీయస్థాయిలో హిందీ సీరియళ్ళను డామినేట్ చేసి మరీ అత్యధికంగా టీఆర్పీ రేటింగులు సాధించడం గ్రేటే! అందుకే స్టార్ మా టీవీ కూడా ఇప్పుడు తెలుగు ఎంటర్తైన్మెంట్ ఛానెల్స్ లో టాప్ గా నిలబడింది.