Nishad Yusuf: కంగువా మూవీ ఎడిటర్ అనుమానాస్పద మృతి
కంగువ మూవీ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
Nishad Yusuf: కంగువ మూవీ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కొచ్చిలోని పనంపిల్లి నగర్ లో ఉంటున్న 43 ఏళ్ల నిషాద్ తన నివాసంలో తెల్లవారుజామున విగత జీవిగా కనిపించాడు. ఆయన మరణ వార్తతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిషాద్ ఉదయం 2 గంటల సమయంలో మృతిచెందినట్టు భావిస్తుననారు. అతని మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. విచారణ పూర్తయిన తర్వాత నిషాద్ మృతదేహాన్ని ఎర్నాకులం జనరల్ ఆస్పత్రికి తరలిస్తామని పోలీసులు తెలిపారు.
తమిళ ఇండస్ట్రీలో ఎడిటర్ గా మంచి పేరు తెచ్చుకున్న నిషాద్ మూసుఫ్.. ఆకస్మిక మరణం సౌత్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిషాద్ గతంలో మలయాళంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ టోవినో థామస్ నటించిన తల్లుమాల సినిమాకు గాను ఉత్తమ ఎడిటర్ గా అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం ముమ్ముట్టి హీరోగా వస్తున్న బజూక చిత్రానికి ఎడిటర్ గా పనిచేశాడు. నిషాద్ కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
సినిమాలపై ఫ్యాషన్ తో చిన్న వయసులోనే ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. చావెర్, ఉండా, థల్లుమాలా, సౌదీ వెళ్లాక, వన్, ఆపరేషన్ జావా వంటి హిట్ సినిమాలకు ఎడిటర్ గా పనిచేశాడు. ఆయన చివరిగా బజూక, కంగువా మూవీస్ కి ఎడిటర్ గా వ్యవహరించారు. ఎడిటర్ గా తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలో యూసుఫ్ కి మంచి పేరు ఉంది. మరోవైపు నిషాద్ ఎడిటర్ గా పనిచేసిన చివరి చిత్రాలు ముమ్మట్టి నటించిన బజూక, సూర్య నటించిన కంగువ రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.
నిషాద్ మరణానికి కారణాలేంటా అని ఆరా తీస్తున్నారు పోలీసులు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ఎవరైనా గిట్టని వారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా..? లేక డిప్రేషన్ తో తనకు తానే బలవన్మరణానికి పాల్పడ్డారా..? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. నిషాద్ స్వస్థలం చంగనస్సేరి. తన భార్య, పిల్లలతో కలిసి కొచ్చిలోని పనంపిల్లి నగర్ లో నివాసం ఉంటున్నారు. నిషాద్ యుసుఫ్ మరణవార్త విని సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న కంగువాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం కంగువా. ఈ సినిమా బడ్జెట్ సుమారు 350 కోట్ల రూపాయలకు పైనే అనేది ఇండస్ట్రీ టాక్. తెలుగులో శౌర్యం, శంఖం, దరువు మూవీస్ చేసిన శివ ఈ నినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ పదికి పైగా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 14న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిషాద్ మృతి ఆ చిత్ర బృందానికి పెద్ద షాక్ అని చెప్పాలి.