Emergency Movie: ఈ సినిమాను ఎవరు, ఎందుకు అడ్డుకుంటున్నారు? కంగనా రనౌత్‌ ఆగ్రహానికి కారణమేంటి?

Update: 2024-09-04 15:45 GMT

ఎమర్జెన్సీ మూవీ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1975 లో ఎమర్జెన్సీ విధించినప్పటి పరిస్థితుల నేపథ్యంతో ఎమర్జెన్సీ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి, బీజేపి ఎంపీ కంగనా రనౌత్ ఇందిరా గాంధీ పాత్రలో నటించడం మాత్రమే కాదు.. తానే స్వయంగా డైరెక్ట్ చేశారు. అంతేకాదు.. జీ స్టూడియోస్ నిర్మాణ సంస్థతో కలిసి మణికర్ణిక బ్యానర్‌పై కంగనా రనౌత్ ఈ సినికు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు.

ఇంతకీ ఎమర్జెన్సీ మూవీ విడుదలకు అడ్డం పడ్డదెవరు ?

ఎమర్జెన్సీ నిజానికి సెప్టెంబర్ 6వ తేదీన విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రం ట్రైలర్ కూడా ఇటీవల విడుదలైంది. ఈ ట్రైలర్ చూసిన సిక్కు మత పెద్దలు... ఈ సినిమాలో సిక్కులను తప్పుగా చూపించారని మండిపడ్డారు. ఎమర్జెన్సీ మూవీ విడుదల అయితే, మత కల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు లేఖలు రాశారు. ఎమర్జెన్సీ మూవీపై నిషేధం విధించాల్సిందిగా సిక్కు మత పెద్దలు తమ లేఖల్లో డిమాండ్ చేశారు.

ఖలిస్తానీ ఉద్యమ నేతగా పేరున్న భింద్రన్ వాలేను ఎమర్జెన్సీ మూవీ ట్రైలర్‌లో తప్పుగా చూపించారని సిక్కు మత పెద్దలు ఆరోపించారు. భింద్రన్ వాలేని చూపిస్తూ.. " మీ పార్టీకి ఓట్లు కావాలి.. మాకు ఖలిస్తాన్ కావాలి " అని భింద్రన్ వాలే వ్యాఖ్యానించినట్లుగా ఓ డైలాగ్ పెట్టారు. కానీ వాస్తవానికి భింద్రన్ వాలే ఏనాడూ అలాంటి మాటలు అనలేదు అని సిక్కులు మండిపడుతున్నారు.

పంజాబ్‌లోని శిరోమణి అకాలీ దళ్ పార్టీ ఈ విషయంపై సెన్సార్ బోర్డుకి లేఖ రాసింది. ఈ సినిమా విడుదలైతే మతకల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉందని.. అందుకే సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.

శిరోమణి గురుద్వార ప్రబందక్ కమిటీ కూడా సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. ఈ సినిమా ట్రైలర్‌ని ఇంటర్నెట్లోంచి తొలగించడంతో పాటు ఎమర్జెన్సీ మూవీ నిర్మాతలు సిక్కులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సిక్కు మత పెద్దల నుండి లేఖలు వెల్లువెత్తడంతో ఈ అంశాన్ని సెంట్రల్ సెన్సార్ బోర్డు తీవ్రంగా పరిగణించింది. తాము అన్ని మతాల మనోభావాలను గౌరవిస్తాం అని చెబుతూ ఎమర్జెన్సీ మూవీలో కొన్ని డైలాగ్స్, సన్నివేశాలు తొలగించాలని చిత్ర నిర్మాతలకు సూచించింది.

ఇదే విషయమై సిక్కు మతానికి చెందిన రెండు సంస్థలు మధ్యప్రదేశ్ హై కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాయి. ఎమర్జెన్సీ మూవీని అడ్డుకోవాల్సిందిగా ఆ రెండు సంస్థలు హై కోర్టును విజ్ఞప్తిచేశాయి. హై కోర్టు ఆదేశాలతో కోర్టు ఎదుట హాజరైన సెంట్రల్ బోర్డు.. "తాము ఇంకా చిత్ర నిర్మాతలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదు" అని స్పష్టం చేసింది. సెన్సార్ వివరణ అనంతరం ఈ పిల్‌పై విచారణ ముగిసినట్లుగా మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రకటించింది.

తాజాగా ఎమర్జెన్సీ మూవీ నిర్మాణ సంస్థ.. జీ స్టూడియోస్ బాంబే హై కోర్టును ఆశ్రయించింది. ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించాలని నిర్మాతలు ఈ పిటిషన్‌లో కోర్టును కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై స్పందించిన బాంబే హై కోర్టు, "సినిమాకు సెన్సార్ ఇవ్వాలని మేం సెన్సార్ బోర్డును ఆదేశించలేం" అని స్పష్టం చేసింది. 'అలా చేస్తే అది మధ్యప్రదేశ్ హై కోర్టు తీర్పునకు విరుద్ధమే అవుతుంది' అని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది.

బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎమర్జెన్సీ సినిమాకు మరోసారి షాక్ తగిలింది. కనీసం బాంబే హై కోర్టు ద్వారా అయినా తమ పని చక్కబెట్టుకోవచ్చని భావించిన ఎమర్జెన్సీ సినిమా నిర్మాతలకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. దీంతో ఇప్పట్లో ఇక ఎమర్జెన్సీ సినిమా విడుదల అయ్యే అవకాశాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాందహార్ హైజాక్ మీద నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన వెబ్ సిరీస్‌లో హైజాకర్ల పాత్రలకు హిందువుల పేర్లను ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ బీజేపి నేత అమిత్ మాల్వియా చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని విచ్చిన్నం చేసే శక్తుల సినిమాలకు, అశ్లీలాన్ని ప్రేరేపించే కథనాలకు ఓటిటిలో అనుమతిస్తారు కానీ.. దేశ సమగ్రత కోసం, దేశ హితం కోరుతూ చేసే ప్రయత్నాలకు మాత్రం మోకాలడ్డుతారు అని ట్వీట్ చేశారు.

ఎమర్జెన్సీ మూవీకి అడ్డంకులపై కంగనా రనౌత్ మొదటి నుండి ఆగ్రహం వ్యక్తంచేస్తూ వస్తున్నారు. 'ఆరోజుల్లోనే కాదు, ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ సినిమాపై ఎమర్జెన్సీ విధిస్తున్నారు' అని ఆమె మండిపడ్డారు. "హిందువులను ఉగ్రవాదులుగా చూపించే సినిమాలు, బూతు డైలాగుల సినిమాలు ఓటిటిలో వచ్చేస్తాయి. కానీ చరిత్రలో వాస్తవాలను చూపించే ప్రయత్నం చేసిన తమ సినిమాను రాజకీయం చేసి అడ్డుకుంటారా" అని ప్రశ్నించారు.

Tags:    

Similar News