Jr NTR: నట దేవరకు ఈ ఐడెంటిటీ మామూలుగా రాలేదు...

Jr NTR: ఎన్టీఆర్, తారక్.. ఎలా పిలిచినా పలుకుతాడు. పేరుకు తగినట్లుగానే అభిమానులకు ఆ పేరే ఒక తారక మంత్రం.

Update: 2024-09-26 10:11 GMT

Junior NTR: నట దేవరకు ఈ ఐడెంటిటీ మామూలుగా రాలేదు...

ఎన్టీఆర్, తారక్.. ఎలా పిలిచినా పలుకుతాడు. పేరుకు తగినట్లుగానే అభిమానులకు ఆ పేరే ఒక తారక మంత్రం. ఆర్ఆర్ఆర్ మూవీ లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత ఎన్టీఆర్ ఈసారి దేవర మూవీతో ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న దేవర మూవీ రెండు భాగాలుగా రూపొందింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోంది.

రిలీజ్‌కి ముందే అటు ఓవర్సీస్‌లో, ఇటు ఇండియన్ బాక్సాఫీస్ మార్కెట్లో దేవర మూవీ అత్యధిక బుకింగ్స్‌తో దూసుకుపోతోంది. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ కావడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా.. దేవర మేనియానే కనిపిస్తోంది. కానీ ఎన్టీఆర్‌కి యీ రేంజ్ పాపులారిటీ ఊరికే రాలేదు. అడ్డదారిలో అసలే రాలేదు. ఆ కథా కమామిషు ఏంటో ఓసారి ఎన్టీఆర్ రియల్ లైఫ్ రీల్ వెనక్కి తిప్పిచూద్దాం.

ఇంటగెలిచి.. రచ్చగెలిచాడు

ఇవాళ తారక్ అందరివాడు. అందరూ తారక్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ తారక్ ఒకప్పుడు ఒంటరివాడే.. ఈ దేవర జీవితంలోనూ ఎన్నో చీకటి రోజులున్నాయి. తారక్ జీవితంలో ఆటుపోట్లను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే, పడిలేచిన వాడే దేన్నయినా జయిస్తాడన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటాడు.

సీనియర్ ఎన్టీఆర్ తనయుల్లో ఒకరైన నందమూరి హరికృష్ణ గురించి మనం ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. హరికృష్ణ సినిమాల తరహాలోనే ఆయన మాట కూడా అంతే కటువుగా ఉండేది. హరికృష్ణకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మికి ముగ్గురు సంతానం. వారిలో నందమూరి జానకి రామ్ పెద్దోడు కాగా ఆ తరువాతి వారిలో కళ్యాణ్ రామ్, సుహాసిని ఉన్నారు. ఇక రెండో భార్య షాలిని సంతానమే తారక్. షాలిని స్వస్థలం కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుండాపూర్‌గా చెబుతుంటారు. హరికృష్ణ-షాలిని దంపతులకు 1983 మే 20వ తేదీన తారక్ జన్మించాడు.

హరికృష్ణకు తారక్ రెండో భార్య కొడుకు కావడంతో నందమూరి వంశం మొత్తం తారక్‌ని మొదటి నుండీ దూరం పెడుతూ వచ్చింది. కన్నతండ్రి హరికృష్ణ, తన తాతగారైన సీనియర్ ఎన్టీఆర్ తప్ప ఆ కుటుంబంలో మిగతా వాళ్లేవ్వరూ తారక్‌ని కానీ లేదా వాళ్లమ్మ షాలినిని కానీ ఆదరించలేదని అంటారు. అలా చిన్నప్పుడే అయిన వాళ్లందరికీ దూరంగా పెరుగుతూ వచ్చిన తారక్ తన ప్రతిభకు సాన పెట్టుకుంటూ తనదైన గుర్తింపుతో ఈస్థాయికొచ్చాడు.

వెండితెరపై మొదటి అడుగు

1997 లో వచ్చిన బాల రామాయణం సినిమాలో తారక్ బాల రాముడిగా నటించాడు. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఆ పౌరాణిక చిత్రం ఒక నేషనల్ అవార్డు, రెండు నందులను కైవసం చేసుకుంది. అంతేకాదు.. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలోనూ బాల రామాయణం సినిమా స్క్రీనింగ్ జరిగింది. ఆ సినిమాలో తారక్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాంతో అప్పటివరకు కొంతమందికే తెలిసిన తారక్ ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు.

అంతకంటే ఆరేళ్లకు ముందే స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ రచించి, డైరెక్ట్ చేసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీలో భరత అనే బాలనటుడి పాత్రతో బాలనటుడిగా పరిచయమైనప్పటికీ.. అది తారక్‌కి అంతగా ఇమేజ్‌ని ఇవ్వలేదు. పైగా అప్పుడు తారక్‌కి కేవలం ఏడేళ్లే. కానీ బాల రామాయణం పూర్తిస్థాయి బాలనటుడి పాత్ర కావడంతో అది నటుడిగా తారక్‌కి గట్టి పునాది వేసింది.

పేరు మార్చిన సీనియర్ ఎన్టీఆర్

తారక్‌కి ముందుగా పెట్టిన పేరు తారక్ రామ్. కానీ ఆ పేరును స్వయంగా సీనియర్ ఎన్టీఆరే మార్చేశారు. తారక్ రామ్‌కి తన పేరే పెడుతూ ఎన్టీఆర్‌ని చేశారు. అలా తారక్ జూనియర్ ఎన్టీఆర్ అని స్వయంగా తాతగారితోనే పిలిపించుకున్నారు. బహుషా తాతకు తగ్గ మనవడు అవుతాడని అప్పట్లోనే ఆ సీనియర్ ఎన్టీఆర్ ఊహించినట్లున్నారు. అందుకే తాను బతికుండగానే తన పేరుని మనవడికి ఇచ్చేశారు. ఆ పేరే ఇప్పుడు తెలుగు సినిమాలో రికార్డులు తిరగరాస్తోంది.

నందమూరి పేరు బలమే కాదు, సొంత కష్టం కూడా...

తెలుగు సినీ పరిశ్రమలో వటవృక్షంలాంటి నందమూరి వంశంలో పుట్టినప్పటికీ.. జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి వ్యక్తిగతంగా చాలా కష్టపడ్డాడు. చిన్నప్పుడే కూచిపూడి నేర్చుకున్నాడు. అనుకోకుండా పెరిగిన బరువుని కఠినమైన లైఫ్ స్టైల్‌తో అమాంతం తగ్గించుకున్నాడు. అదరగొట్టేలా స్టెప్పులేసినా, ఆడియెన్స్ సీట్లలోంచి లేచి చప్పట్లు కొట్టేలా ఫ్యాక్షన్, యాక్షన్ సీన్స్ చేసినా.. అది యువ నటుడిగా కేవలం ఎన్టీఆర్‌కే చెల్లింది. ఎందుకంటే జస్ట్ సినిమాల్లోకి వస్తూనే, ఆ వయస్సులో ఎన్టీఆర్ చేసినన్ని మాస్ హీరో పాత్రలు ఇప్పుడు మనం చూస్తోన్న యంగ్ హీరోలు ఎవ్వరూ చేయలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వచ్చిన స్టూడెంట్ నెం 1, ఆది, నాగ, సింహాద్రి, ఆంధ్రావాలా, సాంబ, రాఖీ, యమదొంగ, ఆ తరువాత దమ్ము సినిమాలు అలాంటివే.

మొదటి సినిమాతో అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..

అది 2000 సంవత్సరంలో ఎన్టీఆర్ వయస్సు జస్ట్ 17 ఏళ్లు. బాల రామాయణం తరువాత ఎన్టీఆర్‌ని హీరోగా పరిచయం చేసే సినిమా కోసం దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు తన శిష్యుడైన ఎస్ఎస్ రాజమౌళికి సూచించాడు. అప్పుడే రాజమౌళి దర్శకుడిగా తన తొలి సినిమా స్టూడెంట్ నెం 1 ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆ సినిమాకు సైన్ చేశాడు. కానీ ఆ సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యమవుతూ వచ్చింది.

దీంతో ఆలోగా ఎన్టీఆర్‌పై రామోజీ రావు కన్నుపడింది. రాజమౌళికి క్లారిటీ వచ్చే గ్యాప్‌లోనే ఉషా కిరణ్ మూవీస్ సంస్థ బ్యానర్‌పై ‘నిన్ను చూడాలని’ అనే రొమాంటిక్ మూవీ తీశారు. వీఆర్ ప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది.

ఆ తరువాత రెండో సినిమాగా విడుదలైన స్టూడెంట్ నెం. 1 మూవీ ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. అప్పుడప్పుడే మూతి మీద మీసాలొస్తున్న దశలో పడిన ఈ బొమ్మ ఎన్టీఆర్‌లోని నటుడిని సూపర్ ఎలివేట్ చేసింది.

ఇక వెనక్కి తిరిగి చూసుకోని ఎన్టీఆర్

స్టూడెంట్ నెం 1 బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తారక్ కెరియర్ తారాజువ్వలా ఎగిసింది. వివి వినాయక్ తొలిసారిగా డైరెక్ట్ చేసిన ఆది మూవీ టాలీవుడ్‌లో ఫ్యాక్షన్ సినిమాలకు కొత్త వరవడిని పరిచయం చేయడం మాత్రమే కాదు.. ఎన్టీఆర్‌ని మరోసారి మాస్ హీరోగా నిలబెట్టింది. అలా మొదలైన ఎన్టీఆర్ సినీ ప్రయాణం దేవర వరకు ఎన్నో ఆటుపోట్లను, అంతులేని విజయాలను చూసింది.

అల్లరి రాముడు, నాగ, ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ వంటి అపజయాలు ఎన్టీఆర్‌ని ఏ మాత్రం కుంగదీయలేదు. మరింత కసితో చేసిన సింహాద్రి, యమదొంగ, రాఖీ, అదుర్స్, బృందావనం, బాద్‌షా, టెంపర్, నాన్నకు ప్రేమతో నుండి జనతా గ్యారేజ్, జై లవ కుశ వరకు తీసిన ప్రతీ సినిమా ఎన్టీఆర్‌ని నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కించాయి... అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకునేలా చేశాయి.

తాతగారి వారసుడిగా గుర్తింపు..

ఎన్టీఆర్ కుటుంబానికి, నందమూరి కుటుంబానికి మధ్య ఉన్న గ్యాప్ క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా.. తాతగారి నటవారసత్వాన్ని అందిపుచ్చుకోవడంలో ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు కనుకే నందమూరి కుటుంబం ఆయన్ని అక్కున చేర్చుకోక తప్పలేదంటారు.

ఏదేమైనా.. కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ మధ్య అన్నాదమ్ముళ్ల బాండింగ్ మాత్రం మొదటి నుంచీ బలంగానే ఉంది.

ఎన్టీఆర్‌ని ఇంటర్నేషనల్ హీరోని చేసిన దర్శకుడు

ఎన్టీఆర్ కెరియర్‌లో ఆర్ఆర్ఆర్ మూవీది ప్రత్యేక స్థానం అని చెబితే చిన్నమాటే అవుతుంది. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీలో గొండ్రూ బెబ్బులి కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ పోషించిన పాత్ర గురించి అది ఇంకో సెపరేట్ స్టోరీ అవుతుంది. ఆ సినిమా కోసం తనని తాను కండలు తిరిగిన యోధుడిలా మల్చుకోవడం నుండి మొదలుపెడితే సినిమాకు ఎండ్ కార్డు పడేవరకు ఎన్టీఆర్ కష్టపడిన తీరు అటువంటిది. అందుకే అది ఎన్టీఆర్‌ని యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది. హాలీవుడ్ విమర్శకుల ప్రశంసలు అందుకునేలా చేసింది.

2009లో సినిమాలకు షార్ట్ బ్రేక్..

2009 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ తన సినిమాలకు షార్ట్ బ్రేక్ ఇచ్చి టీడీపీ స్టార్ క్యాంపెయినర్ అవతారమెత్తాడు. తాతగారు స్థాపించిన పార్టీని గెలిపించడం కోసం, మామ చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చూడటం కోసం అప్పట్లో యాక్టివ్‌గా ప్రచారంలో పాల్గొన్నాడు. అయినప్పటికీ అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అత్యధిక సీట్లు గెలుచుకుని మరోసారి సీఎం అయ్యారు అది వేరే విషయం.

చంద్రబాబుకు నిజంగానే ఎన్టీఆర్ అంటే భయమా?

2009 ఎన్నికల తరువాత ఎన్టీఆర్ మళ్లీ ఎన్నికల ప్రచారంవైపు వెళ్లింది లేదు. ఎన్టీఆర్ చేత ప్రచారం చేయించాలని తెలుగు తమ్ముళ్లు చంద్రబాబును కోరినప్పటికీ.. ఆ విషయంలో ఆయన అంత ఆసక్తి చూపించలేదనేది పబ్లిక్ టాక్. చంద్రబాబు నిర్ణయం వెనుక అనేక కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.

ఎప్పటికైనా తన తరువాత తెలుగు దేశం పార్టీకి తన వారసుడు నారా లోకేషే పెద్ద దిక్కు కావాలని బలంగా కోరుకుంటున్నందువల్లే ఎన్టీఆర్‌ని చంద్రబాబు ప్రోత్సహించలేదనేది విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాదు, ఎన్టీఆర్‌ని ఎప్పటికీ టీడీపీ వైపు రాకుండా చూడటం చంద్రబాబు లక్ష్యాల్లో ఒకటిగా వాళ్లు చెబుతుంటారు.

వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

ఎన్టీఆర్ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ముందుగా 2009 లో మార్చి 26న ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తుండగా అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట సమీపంలో ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎన్టీఆర్‌కి భారీగా గాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దేవుడి దయతో, అభిమానుల ఆశీస్సులతో బతికి బయటపడ్డానని స్వయంగా ఎన్టీఆర్ ఎన్నో వేదికలపై చెప్పుకొచ్చాడు. తన సోదరుడు జానకిరామ్, తన తండ్రి హరికృష్ణ ఇద్దరూ రోడ్డు ప్రమాదంలోనే కన్నుమూశారు. అందుకే రోడ్డు ప్రమాదాల గురించి ఎన్టీఆర్ ఎప్పుడూ అభిమానులను హెచ్చరిస్తూనే ఉంటాడు.

ఇలా చెప్పుకుంటూపోతే దేవర నిజ జీవితంలో ఎన్నో చెప్పుకోదగిన సంఘటనలున్నాయి. అవన్నీ కూడా ఎన్టీఆర్‌ని నటుడిగా రాటుదేల్చినవే. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన్ను ఆల్ రౌండర్‌గా నిలదొక్కుకునేలా చేసినవే. దటీజ్ జూనియర్ ఎన్టీఆర్.

Tags:    

Similar News