సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఏం చేసినా.. అందులో సోషల్ రెస్పాన్స్ కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడినా అందులో సోషల్ మెసేజ్ ఉంటుంది. ఇక ఈ ఇద్దరు ఒకే వేదికపై కనిపిస్తే అది కచ్చితంగా బృహత్తర కార్యక్రమంగా నిలుస్తోంది. వీళ్ల ప్రొఫెషన్స్ వేరు కావచ్చు.. వీళ్లు వెళ్లే రూట్ వేరు కావచ్చు కానీ సమాజంపై ఈ ఇద్దరికి ఉండే అంకిత భావానికి ఎవరైనా హ్యాట్సాఫ్ అంటారు. మరీ సజ్జానార్, ఎన్టీఆర్ ఒకే వేదికపైకి ఎందుకు వచ్చారు. ఈ ఇద్దరి కలిసి ఎవరిని ఎలెర్ట్ చేశారు.
యువకుల్లో మార్పులు తీసుకురావాలి. ప్రమాదాలను నివారించాలి. ఇది సైబరాబాద్ సీపీ సజ్జనార్ టార్గెట్ కానీ పోలీసులు చెబితే చెవినపెడతారు. నో వే.. అదే సినీ సెలబ్రెటీలు చెబితే మాట మాటకి ఈలలు వేస్తారు. అందుకే మొన్న అనుష్క, నిన్న రామ్‌చరణ్‌ను ఆహ్వానించి, వాళ్లతో మంచి మెసేజ్ ఇప్పించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ని రంగంలోకి దింపేశారు సీపీ. సీపీ నుంచి ఆహ్వానం వస్తే సెలబ్రిటీలు రెస్పాన్సిబిలిటిగా ఫీలవుతారు. పిలవగానే కాదనకుండా వీలు చూసుకొని మరీ వచ్చేస్తారు.
సైబరాబాద్ పోలీస్ వార్షిక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసులు కృషి చేస్తున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. హెల్మెట్ లేకపోయినా, డ్రింక్ చేసినా సైబరాబాద్ వెళ్లొద్దు అని చెప్పుకునే స్థాయిలో ట్రాఫిక్ పోలీసులు పని చేస్తున్నారని కొనియాడారు.
వార్షికోత్సవ సందర్భంగా నూతన పెట్రోలింగ్ వాహనాల్ని ఎన్టీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఒక నటుడిగా కాకుండా రోడ్డు ప్రమాదంలో ఇద్దరిని కోల్పోయిన కుటుంబ సభ్యుడిగా వచ్చానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. తమ అన్న జానకీరామ్, తమ నాన్న హరికృష్ణను రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేవుడు అన్ని చోట్ల ఉండలేరు కాబట్టి అమ్మని, గురువుని, సైనికుల్ని, పోలీసుల్ని సృష్టించాడని అన్నారు.
వరుస ప్రమాదాలు తెలుగు రాష్ట్రాలను వెంటాడుతున్నాయి. అరకు, కర్నూల్, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేశాయి. ఈ సమయంలో సీపీ సజ్జనార్ ఈ సమావేశం ద్వారా ప్రజలను ఎలెర్ట్ చేస్తూ అవగాహన కల్పించారు. ఇప్పటికైనా మనమందరం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హ్యాపీగా ఇంటికి తిరిగి వెళ్దాం.