Happy birthday Kaikala satyanarayana: పాత్ర ఏదైనా..ఆయన ముందు తలవంచాల్సిందే..!
Happy birthday Kaikala satyanarayana:తెలుగు సినీ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు ప్రత్యెక కథనం
నవరస నటన అంటే గుర్తుకు వచ్చే పేర్లు తెలుగులో చాలా తక్కువ. ఎస్వీరంగారావు తరువాత ఆ స్థాయిలో ఆ పేరు సాధించింది మాత్రం ఒక్కరే. విలన్.. కామెడీ.. తండ్రి.. తాత.. ఇలా పాత్ర ఏదైనా పరకాయప్రవేశం చేసేస్తారయన. ఎన్టీఅర్ అంతటి నటుడితో పోటీ పడి విలన్ గా నటించిన అయన చిరంజీవి..బాలకృష్ణ..వెంకటేష్..నాగార్జున వంటి హీరోలకూ ప్రత్యర్థి పాత్రలు పోషించారు. ఇక యముడిగా ఆయన తెరమీద కనిపిస్తే ప్రేక్షకుల నీరాజనాలకు అంతే ఉండదు. ఆయనే కైకాల సత్యనాయరణ!
నటుడిగా ఆరుదశాబ్దాలు పూర్తి చేసుకున్న కైకాల సత్యనారాయణ వ్యక్తిగతంగా 85వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈరోజు జూలై 25 అయన పుట్టినరోజు. 1931 లో పుట్టిన ఈ నట కుసుమం తొలిసారి తెరమీద కనిపించింది 1959లో అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో అయన అలరించారు.
సిపాయి కూతురు అయన మొదటి సినిమా. ఈ సినిమాలో అయన హీరోగా పరిచయం అయ్యారు. అయితే, తరువాత అయన విలన్ పాత్రలవైపు మళ్ళారు. ఇక తెలుగు తెరకు సరికొత్త విలన్ దొరికేశాడు. కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా అయన గురించి కొన్ని విశేషాలు మీకోసం!
- లవకుశలో భరతుడిగా..శ్రీకృష్ణార్జున యుద్ధంలో కర్ణుడిగా..నర్తనశాలలో దుశ్శాసనుడిగా ఇలా పౌరనిక సినిమాల్లో అద్భుత పాత్రలు పోషించిన సత్యనారాయణ శ్రీకృష్ణపాండవీయంలో ఘటోత్కచుడి పాత్ర తొలిసారి ధరిస్తే మళ్ళీ 1995లో ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఘటోత్కచుడు చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు.
- యమధర్మరాజు అంటే తెలుగు తెరకి సత్యనారాయణ తప్ప మరొకరు గుర్తురారు. యమగోల సినిమాతో ప్రారంభమైన ఈ పాత్ర జైత్రయాత్ర యముడికి మొగుడు..యమలీల..రాధామాధవ్..దరువు చిత్రాల వరకూ సాగింది.
- మోసగాళ్ళకు మోసగాడు..దొంగల వేట మొదలైన సినిమాల్లో ఆయన విలన్ పాత్రలు మర్చిపోలేని విధంగా ఉంటాయి.
- ఉమ్మడి కుటుంబం..దేవుడు చేసిన మనుషులు..శారద చిత్రాలతో ఆయన ఇమేజ్ మారింది. సాత్వికమైన పాత్రలకు కూడా సత్యనారాయణ బెస్ట్ ఆప్షన్ అయ్యారు. తాత..మనవడు..సంసారం..సాగరం..రామయ్య తండ్రి..జీవితమే ఒక నాటకరంగం..దేవుడే దిగివస్తే..సిరి సిరి మువ్వ..తాయారమ్మ..బంగారయ్య..పార్వతీ పరమేశ్వరులు మొదలైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి విలన్ ఇమేజ్ నుంచి బయటపడి..కుటుంబ ప్రేక్షకులకు అభిమాన నటుడయ్యారు.
-కమెడియన్ నగేష్ డైరెక్టర్ గా..స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు నిర్మించిన మొరటోడు చిత్రంతో హీరోగా మారారు. నా పేరే భగవాన్..ముగ్గురు మూర్ఖులు..ముగ్గురు మొనగాళ్ళు..కాలాంతకులు..గమ్మత్తు గూడచారులు..తూర్పు పడమర..సావాసగాళ్ళు లాంటి చిత్రాల్లో హీరోతో సమాంతరమైన పాత్రలు పోషించారు సత్యనారాయణ. చాణక్య చంద్రగుప్తలో రాక్షసమంత్రిగా న భూతో న భవిష్యత్ అన్నట్లు నటించారు. నా పిలుపే ప్రభంజనంలో ముఖ్యమంత్రి పాత్రతో విస్మయపరిచారు. ఒకటా..రెండా వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
-సుభాష్ ఘాయ్ డైరెక్ట్ చేసిన హిందీ సినిమా కర్మలో విలన్ గా నటించారు. ఈ సినిమాలో శ్రీదేవి తండ్రి పాత్ర ధరించారు. ఒకటీ..రెండు తెలుగు డైలాగ్స్ కూడా ఆ సినిమాలో చెప్పారు సత్యనారాయణ. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ లతో కొన్ని చిత్రాలతో పాటుగా కన్నడ, హిందీ సినిమాల్లో కూడా కైకాల సత్యనారాయణ నటించారు.
- ఇన్ని పాత్రలు పోషించిన ఆయన ఏరోజూ అహం ప్రదర్శించలేదు. ఎన్టీఅర్ కు డూప్ గా (ఎన్టీఅర్ ద్విపాత్ర..త్రిపాత్రాభినయం చేసిన సినిమాల్లో) నటించి నటనకు తానెంత విలువ ఇస్తారో చాటి చెప్పిన అద్భుత వ్యక్తిత్వం ఉన్న నటుడు ఆయన.
కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జేజేలు చెబుతోంది HMTV.